హస్తిన బాటలో హస్తం నేతలు: విస్తరణా.. ప్రక్షాళనా?

కీలకమైన మలుపునకు దిల్లీ వేదిక కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ బృందం హైకమాండ్‌తో భేటీ మాములే అయినప్పటికీ ఈ సారి దిల్లీ వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. కేవలం ఖాలీగా ఉన్న మంత్రి పదవుల భర్తీ (మంత్రివ‌ర్గ‌ విస్తరణ) మాత్రమే కాకుండా, కొంతమంది మంత్రుల పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు (మంత్రివ‌ర్గ‌ ప్రక్షాళన) కూడా జరగబోతుందన్న సంకేతాలు ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యతను చేకూర్చాయి. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్న ఖాలీలను భర్తీ చేయడంతో పాటు, కొన్ని కీలక జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది.

ముఖ్యంగా రంగారెడ్డి, నిజామాబాద్ వంటి ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆయా ప్రాంతాల సీనియర్ ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాలకు మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు విస్తరణలో ఈ జిల్లాలకు చోటు కల్పించే క్రమంలో ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వ‌డ‌మ‌నేది పెద్ద పజిల్. ఒక జిల్లాకు ప్రాధాన్యత ఇస్తే, ఎక్కువ సీట్లు గెలిపించిన ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల నేతలు అదనపు పదవుల కోసం ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీనియర్ నేత కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, కేకే వంటి ప్రముఖులు ఇప్పటికే దిల్లీ వేదికగా ఏఐసీసీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత మరియు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని హైకమాండ్ ఎవరికి పచ్చజెండా ఊపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈసారి పర్యటన కేవలం కొత్తవారిని చేర్చుకోవడానికే పరిమితం కావడం లేదు. ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన మంత్రి కొండా సురేఖ భవితవ్యంపై కూడా అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులపై వేటు పడే అవకాశం ఉందన్న వార్తలు పార్టీ అంతర్గత క్రమశిక్షణను కాపాడే వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, బలమైన బీసీ లేదా సామాజిక వర్గ నేతలపై చర్యలు తీసుకునేటప్పుడు రాజకీయ సమీకరణాలు దెబ్బతినకుండా చూసుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలు.ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన నాటి నుండి ప్రజా రంజక పాలన, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కానీ, క్షేత్రస్థాయిలో పాలన మరింత వేగవంతం కావాలంటే సమర్థులైన మంత్రుల అవసరం ఎంతైనా ఉంది. శాఖల పునర్విభజన ద్వారా పాలనా సామర్థ్యాన్ని పెంచడం, కొత్త రక్తాన్ని ఎక్కించడం ద్వారా ప్రభుత్వ ఇమేజ్‌ను మార్చడంపైనే ముఖ్యమంత్రి దృష్టి సారించారు. కేవలం లాబీయింగ్, రాజకీయ బేరసారాలకు లొంగకుండా.. నిజాయితీ, పనితీరు మరియు ప్రజల్లో పట్టు ఉన్న నేతలకే మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సిన బాధ్యత హైకమాండ్‌పై ఉంది.

మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన అనేది ఏ ప్రభుత్వానికైనా కత్తిమీద సామే. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది మరింత సంక్లిష్టంగా మారింది. పార్టీని నమ్ముకుని దశాబ్దాలుగా ఉన్న సీనియర్ నేతలకు, ఎన్నికల ముందు లేదా తర్వాత పార్టీలోకి వచ్చిన వలస నేతలకు (ఉదాహరణకు బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలు) మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. సీనియర్లను కాదని వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తే అంతర్గత తిరుగుబాట్లు మరియు గ్రూపు రాజకీయాలు ముదిరే ప్రమాదం ఉంది. పనితీరు బాగోలేదని లేదా వివాదాల్లో చిక్కుకున్నారని కొందరు మంత్రులను తొలగించాలని భావిస్తే, అది వారి సామాజిక వర్గాల్లో (ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా మైనారిటీ వర్గాల్లో) తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉంది. ఒకరిని తొలగించినప్పుడు ఆ స్థానాన్ని అదే వర్గానికి చెందిన బలమైన నేతతో భర్తీ చేయకపోతే ప్రతిపక్షాలకు పెద్ద అస్త్రం దొరికినట్లవుతుంది. ఇదిలావుండ‌గా ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. తాజా సమీకరణాల్లో మహిళా కోటా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, ఇప్పటికే ఉన్న మహిళా మంత్రుల చుట్టూ నడుస్తున్న వివాదాల నేపథ్యంలో కొత్తవారిని ఎంపిక చేయడం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలుగా మారింది.

దిల్లీ అధిష్టానం జాతీయ స్థాయి రాజకీయ సమీకరణాలను (ఉదాహరణకు రాబోయే లోక్‌సభ స్థానాల వ్యూహాలు లేదా ఏఐసీసీ సమీకరణాలు) దృష్టిలో ఉంచుకుని కొన్ని పేర్లను ప్రతిపాదించవొచ్చు . కానీ, క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ మనుగడకు, స్థానిక గ్రూపులను మేనేజ్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు వేరేలా ఉండవొచ్చు . ఈ రెండింటి మధ్య సమతుల్యత కుదరడం అంత సులువు కాదు. తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు. కేవలం పదవుల పెంపకం లేదా అంతర్గత అసంతృప్తిని చల్లార్చడానికే కేబినెట్ విస్తరణ పరిమితమైతే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. దిల్లీ వేదికగా జరిగే ఈ కసరత్తు, రాష్ట్రంలో ఒక సుస్థిరమైన, అవినీతి రహితమైన మరియు వేగవంతమైన పరిపాలనను అందించేలా ఉండాలి. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేసినప్పుడే ఈ కేబినెట్‌ మార్పులకు నిజమైన సార్థకత చేకూరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *