– రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
– దేవరకద్ర డీఆర్‌డీఎల్కు ఉచితంగా భూ కేటాయింపు
– ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు 1500 ఎకరాల సేకరణకు రాష్ట్రం ఆమోదం
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’తో పాటు ‘రక్షణ ఎక్స్‌పో-2026’కు హాజరుకావాల్సిందిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. బుధవారం దిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ అయిన సీఎం సదస్సు నిర్వహణ, రాష్ట్రంలోని పలు రక్షణ రంగ ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఈ సమ్మిట్ జరగనుందని, అందులో భాగంగా నిర్వహించే ‘రక్షణ ఎక్స్‌పో-2026’ను ప్రారంభించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే రక్షణ ఎక్స్‌పోకు రక్షణ శాఖ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేస్తే వారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించే రక్షణ ఎక్స్‌పో-2026కు స్వాగతం పలికేందుకు తమ ప్రభుత్వం ఎదురుచూస్తోందని రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు
రక్షణ ఎక్స్‌పో భాగస్వామ్యం
ఎయిర్‌షో నిర్వహణకు గగనతల అనుమతులతోపాటు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాల ప్రదర్శనలు ఉండేలా సహకరించాలని కోరారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రతినిధులు ఈ ఎక్స్‌పోలో పాల్గొనేలా చూడాలన్నారు. హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు డీఆర్‌డీవో ల్యాబ్‌లు తమ సాంకేతికతను ప్రదర్శించేలా ప్రోత్సహించాలని కోరారు. స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు కూడా సహకరించాలన్నారు. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేయాలని, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగస్వాములు కావాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు భూ కేటాయింపు
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్ చేపట్టనున్న ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా 33 సంవత్సరాల కాలానికి, సంవత్సరానికి ₹1 నామమాత్రపు లీజు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలియజేశారు.
ఆదిలాబాద్ విమానాశ్రయం
విమానాశ్రయం కోసం ఇప్పటికే 750 ఎకరాలు సేకరించగా రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు మిగిలిన 750 ఎకరాలు (మొత్తం 1500 ఎకరాలు) కూడా సేకరించి ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర శక్తి శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, ఎంపీలు ఎం.అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





