– విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్ అండ
– మాజీ మంత్రి తలసాని
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1 : రాష్ట్రంలోని లక్షలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులను, వారి భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకులు, విద్యార్థులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తలసానిని కలసి, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యకు దూరం కాకూడదనే సదుద్దేశంతో నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తెచ్చారని, ఆ తర్వాత కేసీఆర్ హయాంలో కూడా సకాలంలో నిధులు విడుదల చేశారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.11 వేల కోట్ల బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు కోర్సులు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 7 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, బీఆరఎస్ పార్టీ విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ అండగా ఉంటుందని తలసాని హామీ ఇచ్చారు. నీట్ పేపర్ లీకేజీపై ‘జెన్ జీ’ యువత జరిపిన నిరసనలతో కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా దిగొచ్చిందో అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా విద్యార్థులు గట్టి పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



