ఏఐని భూతంగా చిత్రీకరించవద్దు

– ఎప్పటికప్పుడు కొత్త విధానాలను స్వీకరించాలి
– ఏఐతో ఉపాధికి ప్రమాదం లేదు
– హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– రాండమ్ ట్రీ్స్ కేంద్ర కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉద్యోగాలు హరించే భూతంలా కాకుండా కొత్త అవకాశాలను సృష్టించే సాంకేతిక పరిజ్ఞానంగా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువతకు పిలుపునిచ్చారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుంటూ కొత్త ఆవిష్కరణలకు సిద్ధం కావాలని సూచించారు. హైదరాబాద్‌లో డేటా, ఏఐ, ఇన్నోవేషన్ రంగాల్లో పనిచేస్తున్న రాండమ్ ట్రీ్స్ సంస్థ భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు సాంకేతిక పరిణామాలపై ఆయన మాట్లాడారు. ప్రతి సాంకేతిక విప్లవం తొలుత కొన్ని భయాలను, సందేహాలను సృష్టించినప్పటికీ కాలక్రమేణా కొత్త రంగాలకు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. గతంలో బ్యాంకింగ్ రంగంలో కంప్యూటర్ల ప్రవేశాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తూ మార్పులను అడ్డుకోవడం కంటే వాటికి అనుగుణంగా మారడమే అభివృద్ధికి మార్గమన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళనతో ఆగిపోకుండా దానిని ఎలా ఉపయోగించుకోవాలి, ప్రపంచ పోటీలో ఎలా ముందుండాలి అనే అంశాలపై యువత దృష్టి సారించాలని సూచించారు. స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌తోపాటు కొత్త విషయాలను నేర్చుకోవడం, అవసరమైనప్పుడు పాత పద్ధతులను వదిలి కొత్త విధానాలను స్వీకరించడం నేటి ఉద్యోగ ప్రపంచంలో కీలకమని చెప్పారు. సాంకేతిక మార్పులను అర్థం చేసుకుని, వాటిని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా ప్రభుత్వాలు విధానాలను రూపొందించాలని సూచించారు. ప్రభుత్వాలు అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని, ప్రైవేట్ రంగం అభివృద్ధి చెందేలా అవసరమైన పరిస్థితులను సృష్టించడం ముఖ్యమని కేటీఆర్ అన్నారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు అనవసరమైన అడ్డంకులు లేకుండా చూడటం, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా మరిన్ని ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉంటుందని వివరించారు.మంచి రహదారులు, నిరంతర విద్యుత్, నీటి సరఫరా, మెరుగైన రవాణా, శాంతిభద్రతలు, నాణ్యమైన పట్టణ మౌలిక సదుపాయాలు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమని పేర్కొన్నారు. పరిశ్రమలు ప్రశాంతంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించడంతో పాటు, సంస్థలు విస్తరించేందుకు ప్రభుత్వాలు సహకరించాలని సూచించారు. గత పదేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి, హైదరాబాద్‌ను అంతర్జాతీయ సంస్థలకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చేందుకు తమ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, అంతర్జాతీయ పెట్టుబడులు, సాంకేతిక సంస్థలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా, ఏఐ పరిశోధన, డేటా సైన్స్, ఉత్పత్తుల అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు కూడా ప్రధాన కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాండమ్ ట్రీ్స్ వంటి సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా సాంకేతిక రంగానికి, యువత ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో తాము చేపట్టిన ‘సాగు-బాగు’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం కల్పించవచ్చని కేటీఆర్ వివరించారు. పంటలకు సోకే చీడపీడలను ఫొటోల ద్వారా గుర్తించి, వాటి నివారణకు అవసరమైన సూచనలు అందించే పరిష్కారాలను ఈ కార్యక్రమంలో ప్రయోగాత్మకంగా వినియోగించినట్లు తెలిపారు.ఇదే తరహాలో వైద్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, ప్రభుత్వ సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా సేవల నాణ్యతను పెంచవచ్చని పేర్కొన్నారు. సాంకేతికత కొద్దిమందికే పరిమితం కాకుండా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి రావాలని అభిప్రాయపడ్డారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ వంటి డిజిటల్ వేదికలు కొత్త వ్యాపార నమూనాలకు, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేశాయని ఆయ‌న అన్నారు. ఇదే విధంగా ఏఐ ఆధారిత స్టార్టప్‌లు, సాంకేతిక సంస్థలు భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేస్తూ యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, యువతను భవిష్యత్తు ఉద్యోగాలకు సిద్ధం చేయడం ద్వారా తెలంగాణ సాంకేతిక ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.

—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *