– రాజకీయ నాయకత్వంలో నిర్ణయాధికారాన్ని సాధించాలి
– పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
– పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల నాయకత్వంపై సదస్సు
– పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
– పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళల నాయకత్వంపై సదస్సు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదిగి అన్ని రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. మహిళలు రాజకీయాల్లో ఎదిగే క్రమంలో ఎదురయ్యే వివక్ష, అడ్డంకులకు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మాదాపూర్‌లోని ఓ హోటల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు.. మహిళా రాజకీయ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై శనివారం జరిగిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ములుగు వంటి అటవీ ప్రాంతంలోని పేద కుటుంబంలో జన్మించిన తనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, చిన్నతనంలో సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూడలేక నక్సలైట్‌గా మారానని, ఆ తర్వాత న్యాయవాది, ఎమ్మెల్యే, మంత్రి అవుతానని ఎన్నడూ ఊహించలేదని అన్నారు. కష్టాన్ని నమ్ముకుని పనిచేశాను.. నేడు మీ ముందు మంత్రిగా నిలబడ్డాను అని సీతక్క పేర్కొన్నారు. ములుగు ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ పెద్దల సహకారంతో రాష్ట్రంలో కీలకమైన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందన్నారు. మంత్రి పదవిలో ఉన్నప్పటికీ తన మూలాలను మర్చిపోలేదని, ప్రజా జీవితంలో ఉన్నవారు ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండాలని అన్నారు. ప్రజలచే ఎన్నికైన నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నదే తన సిద్ధాంతమని చెప్పారు. ‘ప్రజాప్రతినిధులుగా మనం ప్రజలకు జవాబుదారులం.. మనం ప్రజలకు బాసులం కాదు.. సేవకులం. చేపకు నీళ్లే బలం.. నాయకులకు ప్రజలే బలం. నీళ్లు లేకుండా చేప బతకలేనట్లే ప్రజలతో సంబంధం లేకుండా నాయకుడు రాజకీయంగా నిలబడలేడు’ అని సీతక్క స్పష్టం చేశారు. మహిళలు రాజకీయంగా ఎంతటి ఉన్నత స్థానాలకు చేరుకున్నా వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పురుష మంత్రులకు లభించే గౌరవం మహిళా మంత్రులకు ఎప్పుడూ సమానంగా లభించడం లేదన్నారు. అయినా మహిళలు వెనుకడుగు వేయకుండా అంకితభావం, దృఢ సంకల్పంతో పనిచేస్తూ ముందుకు సాగాలని సూచించారు. పంచాయతీస్థాయి నుంచి పార్లమెంట్ వరకు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం మాత్రమే సరిపోదని, వారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం, తగిన గౌరవం పొందాలని సీతక్క అన్నారు. మహిళా ప్రజాప్రతినిధులు ఇతరులపై ఆధారపడకుండా తమ బాధ్యతలను స్వయంగా నిర్వర్తించేందుకు అవసరమైన అవకాశాలు, శిక్షణ, సంస్థాగత సహకారం అందించాలన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, రాజకీయ సాధికారత పరస్పరం ముడిపడి ఉన్నాయని మంత్రి తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల ద్వారా మహిళలు వ్యాపారాలు ప్రారంభిస్తూ ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని తెలిపారు. ఆర్థికంగా బలోపేతమైన మహిళలు రాజకీయాల్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరని అన్నారు. మహిళా నాయకులు నిర్భయంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వాతావరణం కల్పించడంతోపాటు, రాజకీయ శిక్షణ, మార్గదర్శకత్వం, చట్టపరమైన సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి అమ్మాయి సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా లేదా ప్రధానమంత్రిగా ఎదగాలని కలలు కనే పరిస్థితులు రావాలని సీతక్క ఆకాంక్షించారు. మహిళలు అడ్డంకులను అధిగమించి ఆత్మగౌరవంతో, స్వతంత్రంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టే సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఏఐసీసీ కార్యదర్శి గురుదీప్ సింగ్ సత్పాల్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, కర్ణాటక మాజీ ఎమ్మెల్యే అంజలి, కాంగ్రెస్ సనత్‌నగర్ ఇన్చార్జి కోట నీలిమ, కాంగ్రెస్ మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





