నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధింపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 9 : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Modi) ఆదివారం భాగ్యనగర పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొని ప్రసంగించ నున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశాయి. ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం 2:50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సభ జరిగే పరేడ్ గ్రౌండ్స్‌కు బయలుదేరుతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో మూడంచెల భద్రతా వలయాన్ని నిర్మించారు. సుమారు 2,000 మందికి పైగా పోలీసులతో పాటు, ప్రత్యేక రక్షణ బృందాలు, స్నైపర్లు, ముఫ్తీ పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ప్రధాని పర్యటన, బహిరంగ సభ కారణంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ముఖ్యంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకు వెళ్లే ప్రధాన రహదారులతో పాటూ సికింద్రాబాద్ పరిసరాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు





