- నగర జనాభాకు అనుగుణంగా వసతులు
- హైదరాబాద్‌లో త్రీ-లెవెల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్
- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సీఎం రేవంత్ రెడ్డి
- తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్ ఆవిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 9 : ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. సిగ్నల్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. అండర్ పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే త్రీ లెవెల్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించు కున్నామని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే సరిపోదని.. మల్టీ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీఎం వెల్లడించారు.
పార్కింగ్ ఇబ్బందులను అధిగమించేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్టాన్న్రి మూడు భాగాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్యూర్,క్యూర్, రేర్ అభివృద్ధిని మూడు భాగాలుగా విభజించుకున్నామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఏరియాను సర్వీస్ సెక్టార్‌గా గుర్తించా మన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట, రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ఏరియాను మాన్యూఫ్యాక్చర్ సెక్టార్‌గా గుర్తించామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న ఏరియాను అగ్రికల్చర్ సెక్టార్‌గా గుర్తించామని అన్నారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సంబంధించి తెలంగాణ రైజింగ్-2047 మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరించుకున్నామని ముఖ్యమంత్రి అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు మన సంస్కృతికి అనుసంధానం చేయబోతున్నట్లు తెలిపారు.
నగరంలో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఆర్టీసీలో ఈవీ బస్సులను తీసుకొస్తున్నామని అన్నారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మార్చబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఆధునికీకరణ, పట్టణీకరణతో భవిష్యత్‌లో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిటీ ఛైర్మన్ మాగుంట శ్రీనివాసులురెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలపై సమావేశంలో చర్చించారు.





