అణు శక్తిగా మారకుండా ఇరాన్‌ను నిరోధిస్తాం

– ఇరాన్‌కు సాయం చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తాం
– ఇరాన్‌తో వాణిజ్యంపై భారత్‌కు అమెరికా హెచ్చరిక
– మోదీ, ఇరాన్ అధ్యక్షుడు భేటీ నేపథ్యంలో వ్యాఖ్యలు

న్యూదిల్లీ, సెప్టెంబర్ 3 : ఇరాన్‌తో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతోందన్న వార్తలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కొట్టిపారేశారు. అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి ఇరాన్‌కు ఏ దేశం సహకరించినా ఆ దేశం కూడా తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు. కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్‌లో జరిగిన 26వ షాంఘై సహకార సంస్థ(ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజేష్కియాన్‌తో భేటీ అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్, ఇరాన్ మధ్య వాణిజ్య ఒప్పందం ఉందని నేను అనుకోవడం లేదు అని రూబియో ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అయితే, ప్రపంచంలోని చాలా దేశాలు తమ విదేశాంగ విధానాలను స్వతంత్రంగా రూపొందించుకుంటాయని, ఇరాన్‌తో సంప్రదింపులు జరుపుతాయని ఆయన అంగీకరించారు. అవసరమైనప్పుడు ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులతో తాము కూడా చర్చలు జరిపినట్లు గుర్తుచేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన హెచ్చరికను రూబియో పునరుద్ఘాటించారు. ‘అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి ఇరాన్‌కు ఏ దేశం సాయం చేయకూడదు.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి, అణ్వాయుధాన్ని నిర్మించడానికి అవసరమైన ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలను ఇరాన్‌కు కల్పించకూడదు. ఒకవేళ ఏవైనా దేశాలు అలా చేస్తే వాటిపై కూడా మేము ఆంక్షలు విధించాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. ట్రంప్ యంత్రాంగం ప్రధాన లక్ష్యం ఇరాన్‌ను అణ్వాయుధ శక్తిగా మారకుండా నిరోధించడమేనని రూబియో స్పష్టం చేశారు. ‘అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంత కాలం ఇరాన్‌ను అణ్వస్త్ర దేశంగా మారేందుకు ఎప్పటికీ అనుమతించం’ అని అన్నారు. ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రాథమికంగా ఆర్థిక ఆంక్షలను ఉపయోగిస్తామని, అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనుకాడబోమని తెలిపారు. ఇరాన్ తన ఆర్థిక వనరులను దేశ ప్రజల సంక్షేమానికి కాక ఉగ్రవాదం, అణ్వాయుధాల కోసమే ఖర్చు చేస్తోందని రూబియో ఆరోపించారు.

—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *