భీమ్‌రెడ్డిపై ఈడీ మనీలాండరింగ్ కేసు

– బీనామీల పేర్లతో 20కి పైగా చర, స్థిరాస్తులు
– ఆధారాలు సేకరిస్తున్న అధికారులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. అక్రమ ఆస్తులను కూడబెట్టిన కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు గత నెల 6న భీమ్‌రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో కీలకమైన అస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. భీమ్‌రెడ్డి విధి నిర్వహణలో ఉండగా అక్రమ మార్గాల్లో దాదాపు రూ.150 కోట్ల విలువైన ఆస్తులను సంపాదించుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయనతోపాటు బీనామీల పేర్లతో 20కి పైగా చర, స్థిరాస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భారీ అస్తులు ఒకే ప్రాంతానికి పరిమితం కాక పలు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నట్లు తేల్చారు. మణికొండ, గచ్చిబౌలి, తెల్లాపూర్, పటాన్‌చెరు, నాగోలు, మోమిన్‌పేట్, జహీరాబాద్, కర్ణాటకలోని బెంగళూరులోనూ ఖరీదైన ఆస్తులను గుర్తించారు. ఈ ఆస్తుల్లో సింహభాగం నేరుగా ఆయన పేరు మీద కాక బినామీల పేర్లపై కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఏసీబీ దర్యాప్తులో భారీగా బినామీ ఆస్తులు బయటపడటంతో ఈ అంశంపై ఈడీ దృష్టిసారించింది. అవినీతి ద్వారా అక్రమంగా సంపాదించిన మనీలాండరింగ్ ఏ విధంగా మళ్లించారనే కోణంలో ఈడీ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఆస్తుల కొనుగోలు తీరు, భారీ నగదు లావాదేవీలు, ఆ నిధుల మూలాలపై పక్కా ఆధారాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ బినామీ ప్రొహిబిషన్ యూనిట్ కూడా భీమ్‌రెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది. ఈడీ దర్యాప్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో త్వరలోనే భీమ్‌రెడ్డితోపాటు ఆయన బినామీలకు కూడా ఈడీ అధికారులు విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భీంరెడ్డి నివాసముంటున్న విల్లాను 2024లో రూ.4.5 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూతో కొనుగోలు చేసినప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తి చేయలేదని కొద్ది రోజుల క్రితం నిర్వహించిన సోదాల్లో ఏసీబీ గుర్తించింది. గచ్చిబౌలి జయభేరి పైన్ వ్యాలీలోని 3400 చదరపు అడుగుల క్రాంతి సియోన్ అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌ను బినామీ విష్ణువర్ధన్ రెడ్డి పేరుతో కొనుగోలు చేయించినట్లు ఏసీబీ గతంలో తెలిపింది. 2023లో పటాన్‌చెరు డీఎస్పీగా పని చేస్తున్న సమయంలో ముత్తంగిలో రెండు ఇళ్లు కొనుగోలు చేసి బినామీ ఇంద్రకరణ్‌రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కారు సురేశ్ అనే బినామీ పేరుతో కొనుగోలు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. 2007లో గచ్చిబౌలి టెలికాంనగర్‌లోని 244 గజాల ప్లాటును తన తండ్రి పేరుతో కొనుగోలు చేయించి 2010లో గిఫ్ట్ సెటిల్‌మెంట్ ద్వారా తిరిగి తన పేరుకు మార్చుకున్నాడు. 2012లో ఓ ఇంటిని రూ.45 లక్షలకు కొని అదే స్థలంలో జీ-ప్లస్ 12తోపాటు పెంట్ హౌస్ నిర్మించి తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు. ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు ఇప్పటికీ భీంరెడ్డి పేరుతోనే చెల్లిస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *