ట్రంప్ దృష్టిలో అగ్రస్థానంలో మోదీ

– అమెరికా రాయబారి ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూదిల్లీ, సెప్టెంబర్ 4 : జీ-20 సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళ్లనున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీని కలవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగానో కోరుకుంటున్నారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. డిసెంబర్‌లో ఫ్లోరిడాలో జరిగే జీ20 సదస్సు కేవలం బహుపాక్షిక సమావేశాలకే పరిమితం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. ట్రంప్ దృష్టిలో మోదీ స్నేహితుడని, 35మంది నేతలు వస్తే ఎవరిని కలవాలనుకుంటారని అడిగితే మోదీ ఆయన జాబితాలో అగ్రస్థానంలో ఉంటారని గోర్ చెప్పారు. 2020లో భారత పర్యటనను ట్రంప్ ఇప్పటికీ ఎంతో ఇష్టంగా గుర్తు చేసుకుంటున్నారని, వచ్చే ఏడాది ఆయన భారత్‌కు వచ్చే అవకాశం కూడా ఉందని సంకేతాలు ఇచ్చారు. అమెరికా-భారత్ సంబంధాలు ఇతర దేశాలు అసూయపడే రీతిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై కూడా గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత చర్చలను మళ్లీ కొనసాగిస్తున్నామని, ఒప్పందం ‘చాలా దగ్గర్లోనే ఉంది’ అని తెలిపారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 240 బిలియన్ డాలర్లు ఉండగా దీన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని మోదీ, ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ ఆర్థికంగా బలపడటం అమెరికాకు కూడా ప్రయోజనకరమని గోర్ అన్నారు. అమెరికా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెంచుతున్నాయని, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు డేటా సెంటర్లు, ఏఐ కేంద్రాలు, ఔషధ రంగాల్లో విస్తరిస్తున్నాయని చెప్పారు. అమెరికాలోకి కొత్తగా 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడంలోనూ రాయబార కార్యాలయం సహకరించిందన్నారు. భారత్ తమకు విశ్వసనీయమైన రక్షణ భాగస్వామి అని గోర్ పేర్కొన్నారు. ఇతర దేశాల కంటే అమెరికాతో భారత్ ఎక్కువగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అక్టోబర్‌లో మరోసారి భారత్‌కు రానున్నారంటూ తక్కువ వ్యవధిలో విదేశాంగ మంత్రి రెండుసార్లు భారత్‌కు రావడం అరుదని గోర్ అన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కూడా వచ్చే నాలుగు నెలల్లో మూడుసార్లు అమెరికా వచ్చ్లే అవకాశం ఉందని తెలిపారు. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ కూడా ఇరు దేశాల భాగస్వామ్యంలో కీలకమని గోర్ అన్నారు. మానవతా సాయం, విపత్తుల నిర్వహణ, సైనిక సహకారం, కృత్రిమ మేధ, డేటా సెంటర్లు, కీలక ఖనిజాల రంగాల్లో నాలుగు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. త్వరలో నాలుగు దేశాల నేతల శిఖరాగ్ర సమావేశం నిర్వహించేందుకు అమెరికా ఆసక్తిగా ఉందన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *