నేపాల్‌ ‌వరదల్లో 300మంది భారతీయుల గల్లంతు

– విషాదంలో 175కు పెరిగిన మృతుల సంఖ్య
– సహాయక చర్యలకు అనుమతి కోరిన జగ్గీ వాసుదేవ్‌

‌ఖాట్మండ్‌, ఆగస్ట్ 27 : ‌నేపాల్‌ ‌ప్రకృతి విలయంలో గల్లంతైనవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ జలప్రళయంలో 300 మంది వరకు భారతీయులు కొట్టుకుపోయినట్లు నేపాల్‌ ‌విదేశాంగ శాఖ మంత్రి శిశిర్‌ ‌ఖనాల్‌ ‌గురువారం వెల్లడించారు. ఈ విషాదంలో మృతుల సంఖ్య 175కు పెరిగింది.నేపాల్‌ ‌లోని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటన ప్రకారం ఈ ఆకస్మిక వరదల కారణంగా 826 మంది ఆచూకీ గల్లంతయ్యింది. వారిలో 85 మంది భద్రతా సిబ్బంది కాగా 162మంది వివిధ హైడ్రోపవర్‌ ‌కేంద్రాల్లో పనిచేస్తోన్న ఉద్యోగులు ఉన్నారు. 579 పర్యాటకులు ఉన్నారని ఆ సంస్థ పేర్కొంది. వేలమంది నిరాశ్రయులయ్యారు. ఈ భారీ విపత్తు తీవ్రతను అంచనా వేస్తున్నాం అని ఖనాల్‌ ‌పేర్కొన్నారు. అటు టిబెట్‌ ‌వైపు 588 మంది గల్లంతయ్యారు. వారిలో 260 మంది విదేశీయులే. హిమాలయాల్లో కరిగిన మంచు జలవనరుల్లో నీటి మట్టాలను పెంచుతుందని, ఇప్పుడు మనందరం చూసింది అదేనని నేపాల్‌ ‌మంత్రి అన్నారు. ఈ వరద మరింత దిగువకు ప్రవహించి ఉంటే భారత రాష్ట్రాలపైనా ప్రభావం పడేదన్నారు. గతంలోనూ ఇలా జరిగిన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. భారత్‌, ‌చైనా, నేపాల్‌, ‌భూటాన్‌ ‌పర్యావరణపరంగా అనుసంధానమై ఉన్నాయని, ఈ దేశాలు తమ విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మంచు చరియలు విరగడంతో టిబెట్‌ ‌వైపు సంభవించిన వరద గురించి చైనాకు ముందే తెలిసినా నేపాల్‌ను అప్రమత్తం చేయలేదని తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి స్పందన వచ్చింది. ఈ వరదల్లో ఈశా ఫౌండేషన్‌కు చెందిన దాదాపు 80 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. దీనిపై సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ‌స్పందించారు. సహాయక చర్యల్లో సహకరించేందుకు తనతోపాటు మరికొంతమంది వలంటీర్లను అనుమతించాలని చైనా అధికారులను కోరారు. ప్రకృతి విపత్తుతో అల్లకల్లోమైన హిమాలయ దేశానికి భారత్‌ ఆపన్న హస్తం అందించింది. రెండు విమానాల్లో 47.5 టన్నుల సహాయక సామగ్రితోపాటు రెస్క్యూ బృందాలను ఖాఠ్మాండూకు పంపింది.

ఈషా ఫౌండేషన్‌లో విషాద ఛాయలు                                         
80 మంది సంస్థ యాత్రికులు వరదల్లో గల్లంతు  

‌చెన్నై : ఈశా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది యాత్రికులు నేపాల్‌ ‌వరదల్లో గల్లంతైన నేపథ్యంలో సంస్థలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సద్గురు అనుచరులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సాధారణంగా నవ్వుతూ కనిపించే సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ‌కూడా దుఃఖాన్ని అణుచుకోలేక పోయారు. కైలాశ్‌ ‌యాత్ర అనంతరం ఈశా ఫౌండేషన్‌ ‌యాత్రికులు టిబెట్‌లోని గ్యిరాంగ్‌ ఇమిగ్రేషన్‌ ‌సెంటర్‌ ‌వద్ద ఉన్న సమయంలో వరద ముంచెత్తినట్టు తెలుస్తోంది. టిబెట్‌లో జరిగిందని చెబుతూ సద్గురు కన్నీటిపర్యంతమయ్యారు. గురువారం అక్కడికి వెళదామనుకున్నా కుదరలేదని చెప్పారు. గల్లంతైన వారి గురించి ఇప్పటివరకూ తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం అందలేదని అన్నారు. పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోందని భావోద్వేగానికి లోనయ్యారు. గ్యిరాంగ్‌ ఇమిగ్రేషన్‌ ‌సెంటర్‌లో ఈశా యాత్రికుల బృందం ఉన్న సమయంలో ఆ ప్రాంతాన్ని వరద ముంచెత్తిందని చెప్పారు. తాము ఇమిగ్రేషన్‌ ‌సెంటర్‌కు వచ్చినట్టు ఈశా గ్రూప్‌ ‌లీడర్‌ ‌ప్రవీణ్‌ ‌నుంచి తనకు ఉదయం 9.05 గంటలకు మెసేజీ వచ్చిందని సద్గురు చెప్పారు. ఆ తరువాత 9.14కు ఆ భవన సముదాయాన్ని వరద ముంచెత్తిందని అన్నారు. గ్రూప్‌ ‌లీడర్‌ ‌ప్రవీణ్‌తో ఈశా ఫౌండేషన్‌ ‌రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉందని చెబుతూ కన్నీటిపర్యంత మయ్యారు. కొన్ని క్షణాలకు తేరుకున్న ఆయన మళ్లీ మాట్లాడుతూ ప్రవీణ్‌ ‌వద్ద ఉన్న నేపాల్‌ ‌ఫోన్‌ ‌నెంబర్‌ ఆ ‌రోజంతా యాక్టివ్‌గా లేదని చెప్పారు. ’ఆయన దాటి వచ్చి ఉంటే నేపాల్‌ ‌ఫోన్‌ ‌యాక్టివ్‌ అయ్యి ఉండేది. కానీ అలా జరగలేదు. అంటే, గ్రూప్‌ ‌మొత్తం ఇమిగ్రేషన్‌ ‌సెంటర్‌లోనే ఉండి ఉంటుంది’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను మరికొంత మందితో కలిసి అక్కడికి వెళ్లేందుకు భారత్‌, ‌చైనాల అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. టిబెట్‌లో మంచుచరియలు విరిగిపడటంతో అక్కడి నదిలో పోటెత్తిన వరద దిగువ ఉన్న నేపాల్‌లో జలప్రయళం సృష్టించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 170 మంది మరణించగా, 1500 మంది గల్లంతయ్యారు. ఈ ఘటనలో గల్లంతైన భారతీయుల్లో 100 మంది ఆచూకీ తెలిసినట్టు సమాచారం.

మేమంతా క్షేమంగా ఉన్నాం: సతీష్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 27: ‌భారీ వరదలతో నేపాల్‌ ‌పరిసర ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వరదల వల్ల వంద మందికిపైగా మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక వందలాదిమంది గల్లంతయ్యారు. వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. ఆ జాబితాలో భారతీయులు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. దీంతో భారత్‌లోని వారి కుటుంబ సభ్యులు తీవ్ర కలత చెందుతున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే రంగంలోకి దిగి వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో టిబెట్‌ ‌పరిసర ప్రాంతాల్లో ఉన్న డీఆర్‌డీఓ మాజీ చైర్మన్‌ ‌సతీష్‌ ‌రెడ్డి స్పందించారు. తాము క్షేమంగా ఉన్నామని, తాము వరదల్లో చిక్కుకోలేదని అన్నారు. తాము ఉన్న ప్రాంతంలో వరదల ప్రభావం లేదని తెలిపారు. తామంతా క్షేమంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈనెల‌30న హైదరాబాద్‌ ‌చేరుకుంటామని సతీష్‌ ‌రెడ్డి చెప్పారు.

నేపాల్‌ ‌వరదల్లో మాజీ ఎమ్మెల్యే భార్య గల్లంతు

కోల్‌కతా : ‌తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ మాజీ ఎమ్మెల్యే శుభ్రాన్షు రాయ్‌ ‌భార్య శర్మిష్ట భౌమిక్‌ ‌రాయ్‌ ‌నేపాల్‌ ‌వరదల్లో గల్లంతయ్యారు. శర్మిష్ట కోల్‌కతాకు చెందిన ఓ ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా కైలాస మానససరోవర యాత్ర కోసం 21వ తేదీన నేపాల్‌ ‌వెళ్లారు. ఆమె 25వ తేదీ మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో శుభ్రాన్షు రాయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాను టిబెట్‌ ‌సరిహద్దుకు సమీపంలోని కైరోంగ్‌ mప్రాంతంలో ఉన్నట్లు భర్తతో చెప్పారు. బుధవారం ఉదయం నేపాల్‌-‌టిబెట్‌ ‌సరిహద్దుల్లో భారీ ఎత్తున మెరుపు వరదలు వచ్చాయి. అప్పటినుంచి శర్మిష్టతో కమ్యూనికేషన్‌ ‌పూర్తిగా తెగిపోయింది. తన భార్య పేరు మిస్సింగ్‌ ‌లిస్ట్‌లో ఉందని శుభ్రాన్షు రాయ్‌ ‌ధ్రువీకరించారు. శర్మిష్ఠ మాత్రమే కాక ఆమెతోపాటు యాత్రకు వెళ్లిన కోల్‌కతాకు చెందిన 32మంది యాత్రికుల బృందం ఆచూకీ లేకుండా పోయింది. వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార కార్యాలయాన్ని, పశ్చిమ బెంగాల్‌ ‌ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *