న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆ దేశ రాజకీయ చరిత్రలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. యుద్ధానంతర ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా ఆమె నిలిచారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. మెలోనీని ‘నా స్నేహితురాలు’ అని సంబోధిస్తూ ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ మైలురాయే నిదర్శనమని ప్రశంసించారు. ఈ మేరకు ‘ఎక్స’ వేదికగా మోదీ స్పందిస్తూ ‘ఇటలీ యుద్ధానంతర చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతున్న నా స్నేహితురాలు జార్జియా మెలోనీకి అభినందనలు.. ఈ విజయం ఆమె నాయకత్వంపై ఇటలీ ప్రజలు ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక’ అని పేర్కొన్నారు. భారత్-ఇటలీ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం కావడంలో మెలోనీ స్నేహం కీలక పాత్ర పోషించిందని మోదీ అన్నారు. భవిష్యత్తులో కూడా ఇరు దేశాల ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. 2022 అక్టోబర్ 22న ఇటలీ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మెలోనీ ఇవాళ్టికి 1,413 రోజులు పదవిని పూర్తి చేసుకున్నారు. తద్వారా మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ రికార్డును ఆమె అధిగమించారు. గత జులైలో ప్రధాని మోదీ భారత చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా నిలిచినప్పుడు మెలోనీ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు కలిసి పనిచేస్తామన్నారు. గత మే నెలలో మోదీ ఇటలీలో పర్యటించినప్పుడు ఇరు దేశాల సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుతూ ఇరు నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ మెలోనీకి సరదాగా ‘మెలోడీ’ చాక్లెట్లను బహుమతిగా ఇచ్చారు. సోషల్ మీడియాలో వారిద్దరి పేర్లతో వైరల్ అయిన ‘మెలోడి’ ట్రెండ్‌ను ఇది గుర్తుచేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





