12 ఏళ్ల నిరుపేదల కలను నెరవేర్చాం

– రెవెన్యూ మంత్రి పొంగులేటి
– కల్లూరు, ఖమ్మంలో నూతన పెన్షన్ ల‌బ్దిదారుల‌కు ప్రొసీడింగ్స్‌ పంపిణీ

ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 18: 12 ఏళ్లుగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న అర్హులైన పేదల కలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని, రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల నూతన చేయూత పెన్షన్లు మంజూరు చేశామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఖమ్మం నగర దానవాయిగూడెంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాలేరు నియోజకవర్గానికి చెందిన 1, 59, 60 డివిజన్లలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ లబ్దిదారులకు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి మంత్రి పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా కొత్త పెన్షన్ల కోసం ఎంతోమంది పేదలు ఎదురుచూస్తున్నారని, వారి కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కుల వృత్తుల వారికి 4.5 లక్షల నూతన చేయూత పెన్షన్లు మంజూరు చేశారని తెలిపారు. గతంలో ఈ మూడు డివిజన్లలో పర్యటించినప్పుడు రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండేదని, రహదారులపై పెద్ద పెద్ద గుంతలు ఉండేవని మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ అధికా రులు అన్ని రోడ్లను నాణ్యతా ప్రమాణాలతో నిర్మించామని తెలిపారు. రోడ్లపై నెయ్యి పోసి ఏరుకునే విధంగా నాణ్యమైన రహదారులను అభివృద్ధి చేశామని అన్నారు. గత పాలకులకు పేదల సంక్షేమం పట్ల సంకల్పం లేదని, ప్రజా ప్రభుత్వానికి పేదల అభివృద్ధి పట్ల దృఢ సంకల్పం ఉందని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. కల్లూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి కల్లూరు మండలం, మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ లబ్దిదారులకు మంత్రి పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని, ప్రస్తుతం ఆ నిధులతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎంత ఆక్రోశం వ్యక్తం చేసినా పేదల సంక్షేమ కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను స్వాగతించాలని హితవు పలికారు. ఈ కార్యక్ర మంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *