“వ్యవసాయ రంగానికి సంబందించి కొత్తగా రూపొందించిన చట్టాలను వెనక్కు తీసుకోవడం ఒకటైతే ఏకంగా క్యాబినెట్ మంత్రితో రాజీనామా చేయించక తప్పని పరిస్థితి రెండవ అంశానికి చెందింది, అయితే యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు తనను, తల్లిని తిట్టిపోసిన విద్యార్థులను ‘హమారే బచ్చే హై’ అంటూ వాళ్ళను శిక్షించాలనుకోవటంలేదని ఒక వీడియో సందేశంలో పేర్కొనడాన్నిబట్టి మోదీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడంటున్నారు విశ్లేషకులు…”
భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీస్తుందా ?

2014న నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టింది మొదలు నిన్నమొన్నటివరకు దేశ, విదేశాల్లోని భారతీయులు ఆయనకు బ్రహ్మరథం పడుతూ వచ్చారు. మోదీని ఎదిరించి నిలవడమన్నది అసాధ్యమన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ముఖ్యంగా విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేయడం ద్వారా మోదీకి ప్రత్యమ్నాయంలేదన్న భావన ఏర్పడింది. కాని, దేశంలోని రైతులు, నిరుద్యోగ యువకుల్లో మోదీ వ్యవహారతీరుపై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపెను భారంతో ప్రజావ్యతిరేకత చోటుచేసుకుంది. క్రమంగా ప్రజలు తమ గళం విప్పడం ప్రారంభించారు. ఏకంగా దిల్లీ పురవీధుల్లోనే తమ నిరసనను తెల్పడం మొదలు పెట్టారు. వీటిల్లో గతంలో రైతులు చేపట్టిన భారీ నిరసన ప్రదర్శన ఒకటికాగా, నిన్నగాక మొన్న జన్ జీ చేపట్టిన నీట్ ప్రశ్నాపత్రాలకు సంబందించిన ఆందోళన రెండవది. ఈ రెండు అంశాల్లోనూ కేంద్ర ప్రభుత్వం తన దూకుడును తగ్గించుకోక తప్పనిపరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ రంగానికి సంబంధించి కొత్తగా రూపొందించిన చట్టాలను వెనక్కు తీసుకోవడం ఒకటైతే ఏకంగా క్యాబినెట్ మంత్రితో రాజీనామా చేయించక తప్పని పరిస్థితి రెండవ అంశానికి చెందింది, అయితే యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రకటించారు.
అంతేకాదు తనను, తల్లిని తిట్టిపోసిన విద్యార్థులను ‘హమారే బచ్చే హై’ అంటూ వాళ్ళను శిక్షించాలనుకోవటంలేదని ఒక వీడియో సందేశంలో పేర్కొనడాన్నిబట్టి మోదీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడంటున్నారు విశ్లేషకులు. దీన్నిబట్టి పాలనలో మోదీ పట్టు సడలుతున్నదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజాభిప్రాయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా చేపట్టే నిర్ణయాల కారణంగానే ఇలాంటి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయన్నది స్పష్టమవుతున్నది. సరిగ్గా ఈ దశలోనే ప్రశాంత్ కిశోర్ ఘన విజయం ఆ పార్టీపై ప్రభావాన్ని చూపేదిగా మారింది. వాస్తవానికి అదిఒక ఉప ఎన్నిక మాత్రమే. దానికి అంత గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం పెద్దగా లేకపోయినప్పటికీ, మూడు దశాబ్ధాల కంచుకోటను బద్దలుకొట్టిన సంఘటన కావడంవల్లే చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపర్చింది కూడా అదే అంశం. నితిన్ నబీన్ ఆయన తండ్రి కాలంనుండి ఉప, సాధారణ ఎన్నికలు కలుపుకుని దాదాపు 9 సార్లుకూడా బంకీపూర్ నియోజకవర్గంపై ఆధిపత్యం చలాయిస్తూ వస్తున్నవారి కుటుంబాన్ని కాదని మరొకరికి అక్కడి ప్రజలు పట్టం కట్టడమే దేశవ్యాప్త చర్చకు కారణమైంది. అందులోనూ 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్రమోదీ ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకడుగా ఆనాడే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ స్వయంగా అభ్యర్థిగా నిలిచి గెలవటంకూడా చర్చకు కారణమైంది.
ఆయన వ్యూహ రచనతో సుమారు అయిదుగురు వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయినారని చెబుతారు. కాని, 2024లో ఆయనే స్వయంగా జన్ సూరజ్ పార్టీని ఏర్పాటుచేసిన తర్వాత బీహార్‌లో ఒక్క స్థానాన్ని కూడా సాధించుకోలేకపోయారు. అలాంటి కిశోర్ ఇక్కడ విజయం సాధిస్తాడని ఎవరూ ఊహించలేదు. దాంతో కిశోర్ విజయం వెనుకున్న కారణాలపై అధ్యయనం జరుపుతున్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గంలోని యువ వోటర్లే ఆయన గెలుపుకు కారకులుగా భావిస్తున్నారు. ఇటీవల దిల్లీ లో మూడు రోజులపాటు యుద్ద వాతావరణాన్ని సృష్టించిన యువకుల ఆందోళన వెంటనే వచ్చిన ఎన్నికలు కావడంతో స్థానిక యువకులు బిజెపికి వ్యతిరేకంగా వోటు వేశారన్న వాదన ఉంది. ఈ ఉప ఎన్నికల్లో పాల్గొన్న వోటర్ల సంఖ్య గత ఎన్నికలతో పోలిస్తే తక్కువగా ఉంది. వారిలో లక్షా 35వేల వరకు యువ వోటర్లు.
కావడం, వారి కుటుంబ సభ్యులను కూడా వారు జన్ సూరజ్ పార్టీవైపు మరలించి ఉండడంవల్లే కిశోర్ 19వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించాడని తెలుస్తున్నది. ఇది ఒకవిధంగా ప్రాంతీయ, జాతీయ పార్టీలకుకూడా హెచ్చరిక లాంటిది. యువత సంఘటితమైతే భవిష్యత్‌లో భారత రాజకీయాల్లో వారు కొత్త అధ్యాయానికి తెరతీసే అవకాశంలేకపోలేదన్నది దీనివల్ల స్పష్టమవుతున్నది.





