మా కుటుంబాన్ని వివాదంలోకి లాగడం సరికాదన్న నాగార్జున
బాధ్యతగల పదవిలో ఉండి ఇలా మాట్లాడుతారా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
కొండా సురేఖను కోర్టుకు ఈడుస్తామన్న మహిళా నేతలు
మంత్రుల నోళ్లను ఫినాయిల్‌తో కడగాలి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్2: మంత్రి కొండా సురేఖ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ హీరోయిన్స్ సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లని ప్రస్తావించడంపై ఆయన భగ్గుమన్నారు.మంత్రి సరైన సాక్ష్యాధారాలు లేకుండా హీరోయిన్ల పేర్లు ప్రస్తావించడంపై ఆయన ’ఎక్స్ ఖాతా ద్వారా అసహనం వ్యక్తం చేశారు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు? సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొండా సురేఖ చేసిన షాకింగ్ కామెంట్స్, ఆమె కామెంట్స్‌పై ప్రకాశ్‌రాజ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతున్నాయి.
అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నాగార్జున అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
కాగా కేటీఆర్‌పై ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడడం బాధాకరమని ఆమె అన్నారు. ఎక్స్ వేదికగా స్పందించిన సబితా ఇంద్రారెడ్డి.. మీరు చేసిన ఆరోపణ వల్ల కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించారా? బాధ్యతగల పదవిలో ఉండి బాధ్యతరహితంగా మాట్లాడటం బాధాకరమని సబిత పేర్కొన్నారు.
మరోవైపు బిఆర్ఎస్ మహిళా నేతలు సత్యవతి రాథోడ్,మాలోత్ కవితలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలపై కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు తదితర అఘాయిత్యాలపై ఏనాడూ మాట్లాడని మంత్రి కొండా సురేఖ కెటిఆర్‌పై బట్టకాల్చి మీదవేయడం దారుణమని అన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పి, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.
కొండా సురేఖ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ నేత వై సతీశ్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. విడాకులకు కేటీఆర్ కారణమని.. సమంత చెప్పిందా..? నాగచైతన్య చెప్పిండా నీకు..? అని కొండా సురేఖను వైఎస్సార్ సూటిగా ప్రశ్నించారు.





