– జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : ఎన్నికల పోరులో ప్రజాస్వామ్యానికి రిఫరీగా వ్యవహరించాల్సిన భారత ఎన్నికల సంఘం నిష్పాక్షికతను కోల్పోవడం రాజ్యాంగ వ్యవస్థలకే ప్రమాదకరమని, ఈసీ స్వతంత్రతపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ దేశ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఇటీవ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనాన్ని ప్రస్తావిస్తూ కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు–పునరుద్ధరణ, ఓటరు డేటాబేస్ కేంద్రీకరణ వంటి 14 కీలక అంశాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వెల్లడైందన్నారు. గోవాలో అర్హులైన 97 మంది ఓటర్లను అధికారులు ధ్రువీకరించినప్పటికీ కేంద్రీకృత సాఫ్ట్‌వేర్ లోపం వల్ల తుది జాబితాలో పేర్లు చేరకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ వైఫల్యమేనని మండిపడ్డారు. సాంకేతికత మనిషి సౌలభ్యం కోసం ఉండాలి కానీ సాంకేతికత నెపంతో పౌరుల ఓటు హక్కును బలి ఇవ్వకూడదు అని ఆయన పేర్కొన్నారు.
13 కోట్లకు పైగా ఓటర్ల తొలగింపుపై ఆందోళన
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ముసాయిదా ఓటరు జాబితాల నుంచి 13 కోట్లకు పైగా పేర్లు తొలగించడంపై మంత్రి ఉత్తమ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేసే రోజుకు ముందే తప్పులను సరిదిద్ది అర్హులకు న్యాయం చేయాలని, ఎన్నికలు పూర్తయ్యాక పేరు చేర్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించారు.
ఎంపిక కమిటీ మార్పులపై విమర్శలు
ఈసీ నియామక ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగించి ఆ స్థానంలో కేంద్ర మంత్రిని చేర్చడం ద్వారా నిర్ణయాత్మక ఆధిపత్యాన్ని కేంద్రం తన వద్దే ఉంచుకుందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు సీఈసీ నియామకాన్ని వాయిదా వేయాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరినప్పటికీ ప్రభుత్వం తొందరపడి జ్ఞానేశ్ కుమార్‌ను నియమించిందని ఆరోపించారు. కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలతో పాటు ఓటరు జాబితాల నిర్వహణకు ఉపయోగిస్తున్న సాంకేతిక వ్యవస్థ పనితీరుపై ఉన్నత స్థాయి నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితా ప్రభుత్వ ఆస్తి కాదని, ఓటు అధికార పార్టీ సొత్తు కాదని పేర్కొన్న మంత్రి, పౌరుల ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




