– పారిశ్రామిక, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్ధికి సీఎం ప్రణాళికలు
– లక్షలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా పారిశ్రామిక కారిడార్లు
– లగచర్ల రైతు బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
, ప్రజాతంత్ర, నవంబర్ 9 : తరతరాలుగా వెనుకబాటుకు గురైన పాలమూరు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ కొడంగల్‌ను రాష్ట్రానికే కీలక పారిశ్రామిక, విద్య, వైద్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో లక్షలాదిమంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నాయని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్‌లో సోమవారం ఏర్పాటు చేసిన రైతు బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న భట్టి విక్రమార్క ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పాలమూరు జిల్లా అందులోనూ కొడంగల్ నియోజకవర్గం దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైందని, అలాంటి ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కొడంగల్ ప్రజల అదృష్టమని అన్నారు. ముఖ్యమంత్రి తన సొంత ప్రాంత అభివృద్ధికి మాత్రమే కాక ఈ ప్రాంత భవిష్యత్తు తరాల జీవితాల్లో వెలుగులు నింపేలా సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించి కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గంట వ్యవధిలో కొడంగల్‌కు చేరుకునేలా రహదారి సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు, ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు అనువైన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. కొడంగల్‌లో మÖడు వేల ఎకరాలు, పరిగిలో రెండు వేల ఎకరాలు, సీతారాంపూర్, చందనవెల్లి ప్రాంతాలను కలుపుకుని సుమారు ఐదు వేల ఎకరాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాంతానికి భారీ పెట్టుబడులు తరలివచ్చేలా, పరిశ్రమల స్థాపన ద్వారా లక్షలాదిమందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా ముఖ్యమంత్రి ముందుచూపుతో అడుగులు వేస్తున్నారన్నారు.
ఎడ్యుకేషన్ హబ్‌గా కొడంగల్ అభివృద్ధి
పారిశ్రామిక అభివృద్ధితోపాటు విద్యారంగానికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని భట్టి విక్రమార్క తెలిపారు. మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, పాలిటెక్నిక్, ఐటీఐ, మహిళా డిగ్రీ కళాశాల, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ వంటి విద్యాసంస్థల ఏర్పాటుతో కొడంగల్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని స్థాయిల్లో విద్యా సదుపాయాలు అందుబాటులోకి తీసుకొస్తున్నారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాల ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే బాధ్యతను ప్రజా ప్రభుత్వం తీసుకుంటోందని తెలిపారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధిలో సాగునీటి వసతులకు కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కృష్ణా నది నుంచి జూరాల ప్రాంతం ద్వారా నీటిని ఎత్తిపోసి మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి మాత్రమే కాక భవిష్యత్తులో ఏర్పాటు కానున్న పారిశ్రామిక సంస్థలకు కూడా నిరంతర నీటి సరఫరా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. నీటి వసతి, విద్యా సదుపాయాలు, పారిశ్రామిక మౌలిక వసతులు సమాంతరంగా అభివృద్ధి చెందితే కొడంగల్ ప్రాంతం రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన అభివృద్ధి కేంద్రంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. అర్హులైన పేదలకు సన్నబియ్యం పంపిణీ, 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకం వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా పేదల సంక్షేమం, విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కొడంగల్ ప్రాంత ప్రజలతో దీపావళి వేడుకల్లో పాల్గొనడంతోపాటు వారి జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపేలా వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రివర్గ సహచరుల తరఫున, ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తున్నానని భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి సంకల్పం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





