బతుకునిచ్చే తల్లివే!

బతుకునిచ్చే తల్లివే గౌరమ్మ
బంగారు బతుకమ్మవే గౌరమ్మ
తెలంగాణ ఆడబిడ్డవే బతుకమ్మ
ఆత్మగల్ల అమ్మవే బతుకమ్మ
ఉద్యమానికి ఊతమైనవే బతుకమ్మ
నువ్వు రాష్ట్ర పండుగవైతివే బతుకమ్మ
పూల జాతర నీవెలే బతుకమ్మ
స్త్రీల పండుగవైతివే బతుకమ్మ
పచ్చపచ్చని పూలు తంగేడు పూలు
రంగులద్దిన పూలు గునుగు పువ్వుల్లు
ఎర్రఎర్రని పూలు సీతమ్మ జెడలు
ఇంపుగా కనిపించె కోట్లాది పూలు
గౌరమ్మ రూపమే గుమ్మడీ పువ్వులు
గుత్తులుగ పూసేటి గోరింట పూలు
రమ్యమైన పూలు రుద్రాక్ష పూలు
అన్ని రంగుల పూలు అందాల పూలు
తీరొక్క పూలతో పేర్చేము నిన్ను
గోపురం రూపంలొ కూర్చేము నిన్ను
పసుపు గౌరమ్మనుంచీ బతుకమ్మ
నీ చుట్టు తిరిగేములే బతుకమ్మ
ఆటలా వైభోగమే గౌరమ్మ
చప్పట్ల కోలాటమే బతుకమ్మ
పాటలా పరవశమ్మే గౌరమ్మ
పల్లీయ పదములమ్మా బతుకమ్మ
మాటలా మురిపమ్ములే గౌరమ్మ
బంధాల భావమ్ములే బతుకమ్మ
కమ్మనీ కథలైతివే గౌరమ్మ
కష్టాల కడలైతివే బతుకమ్మ
పరమేశు రాణివమ్మా గౌరమ్మ
పార్వతీదేవివమ్మా బతుకమ్మ
తొమ్మిదీ రోజులు పూజలూ గౌరమ్మ
తొమ్మిదో రోజున సద్దులా బతుకమ్మ
పట్టంచు చీరెలు గౌరమ్మ నీకు
అద్దాల రెవికలు బతుకమ్మ నీకు
సద్దులూ సారెలూ గౌరమ్మ నీకు
పసుపూ కుంకుమలు బతుకమ్మ నీకు
గంధమక్షింతలు గౌరమ్మ నీకు
దీపాలు ధూపాలు బతుకమ్మ నీకు
ఆకులూ పోకలూ గౌరమ్మ నీకు
ఘనమైన కట్నాలు బతుకమ్మ నీకు
మనసుతో మొక్కేము గౌరమ్మ నీకు
భక్తితో కొలిచేము బతుకమ్మ నిన్ను
అమ్మవై లాలించవే గౌరమ్మ
బిడ్డవై పాలించవే గౌరమ్మ
నీటిలో ఓలలే గౌరమ్మ నీకు
సుద్దులూ బుద్ధులూ బతుకమ్మ నీకు
పోయి రా గౌరమ్మ పోయి రావమ్మా
మళ్ళి రా బతుకమ్మ మళ్ళి రావమ్మా
మళ్ళొచ్చె ఏటికీ మళ్ళి రావమ్మా
మళ్ళొచ్చె ఏటికీ మళ్ళి రావమ్మా.
-డా.కొమర్రాజు రామలక్ష్మి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *