– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
– ఖేత్ బచావో అభియాన్తో భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయానికి శ్రీకారం
– సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలి
– పంట వ్యర్థాలను కాల్చకుండా మల్చింగ్కు వినియోగించాలి
– నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్ఠోబర్ 22 : నేల తల్లిని సంరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలకు ఆహార భద్రత కల్పించగలమని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా వ్యవసాయంలో ఆశించిన దిగుబడులు సాధించడం సాధ్యం కాదని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల సంక్షేమంతోపాటు భవిష్యత్ వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుని భూసార పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు. గురువారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన’ (సాగు భూమి సంరక్షణ) కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వ్యవసాయ భూముల పరిరక్షణ, భూసార పరీక్షలు, నీటి పొదుపు, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ఎంపిక, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, పంట వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై రైతులకు కీలక సూచనలు చేశారు. భవిష్యత్ తరాలకు సారవంతమైన భూములను అందించాలంటే వ్యవసాయ పద్ధతుల్లో శాస్త్రీయ మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఋతుపవనాల తగ్గుదల, భూతాపం పెరుగుదల, వర్షపాతం అసమానతలు, వర్షాలు సకాలంలో కురవకపోవడం వంటి పరిస్థితులు వ్యవసాయంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూమి స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. రసాయన ఎరువులు, పురుగుమందులను శాస్త్రవేత్తలు సూచించిన మోతాదుల్లోనే ఉపయోగించాలని మంత్రి స్పష్టం చేశారు. పంటల్లో రసాయనాల అవశేషాలు పెరిగితే ఆహార నాణ్యత, భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా తన పంట భూమికి భూసార పరీక్షలు చేయించుకుని నేలలో ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకుని ఏ పంటకు ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో అవసరమో నిర్ధారించుకున్నాకే వాటిని వినియోగించాలని సూచించారు. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గడంతోపాటు నేల సారాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. రైతులను సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించడంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు కీలక పాత్ర పోషించాలని మంత్రి పేర్కొన్నారు.
నీటి వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి
భూగర్భ జలాలు తగ్గిపోతున్న నేపథ్యంలో నీటి వినియోగంలో రైతులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ తక్కువ నీటితో పండే పంటలకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూమి రకం, నీటి వసతి, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి రెండుమూడు తడులతో పండే స్వల్పకాలిక పంటలు, అపరాల పంటలను సాగు చేసుకునేలా రైతులకు సలహాలివ్వాలని సూచించారు. సంప్రదాయ పంటలతోపాటు ప్రాంతానికి అనుకూలమైన ఉద్యాన పంటలను సాగు చేసే అవకాశాలను రైతులకు వివరించాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకునే చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. వాగుల్లో ఇసుకను అధికంగా తీయకుండా సహజ నీటి వనరులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
పంట వ్యర్థాలను కాల్చవద్దు
పంట కోతల అనంతరం మిగిలే వ్యర్థాలను కాల్చివేయడం వల్ల నేలలోని ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు నష్టం కలగడంతోపాటు గాలి కాలుష్యం పెరిగే ప్రమాదం ఉన్నందున వాటిని మల్చింగ్కు వినియోగించాలని, నేలలో తేమ నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని,పశుగ్రాసంగా ఉపయోగించుకునే అవకాశాలను కూడా పరిశీలించాలని మంత్రి సూచించారు. పశు పోషణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, పశువులకు అవసరమైన గ్రాసం పెంపకాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యాంత్రీకరణను విస్తృతంగా వినియోగించడం ద్వారా రైతుల శ్రమ, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించవచ్చన్నారు. చిన్న, సన్నకారు రైతులకు సమూహాల ద్వారా యంత్రాలు అందుబాటులోకి తేవడం వల్ల సాగు పనులు సకాలంలో పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఖేత్ బచావో అభియాన్ను వ్యవసాయ భూముల పరిరక్షణకు నిరంతరం కొనసాగాల్సిన ఉద్యమంగా తీసుకోవాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారులు మండలాల వారీగా కార్యాచరణ రూపొందించి రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





