సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయ జోక్యం మితి మీరితే అందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పాటికే ఉంది . అయినా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవేవీ పట్టించుకోకుండా సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. తన సహజ శైలిలో గేమ్ ఛేంజర్ గా పదేపదే ప్రకటనలు చేశారు. ఈ అతి ప్రచారం కూడా కొంప ముంచినదేమో! ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ గోదావరి బనకచర్ల అనుసంధానం పథకం గురించి ముందుగా పర్యావరణ అనుమతులు కోసం ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు ప , పంపింది . ఇప్పుడు ఏమైంది? రెండు వారాలు తిరక్కముందే పంపిన ప్రతిపాదన తిరిగి టపా లో వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ కు చెందిన అంచనాల నిపుణుల కమిటీ గోదావరి బనకచర్ల అనుసంధానం పథకం తిరిగి పంపినదంటే ఇంతలోనే తమ పోరాటం ఫలించిందని బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు సంతోషించాల్సిందేమి లేదు . అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఘటన ఇందుకు కారణం కాదు.
ఇది కేవలం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జల వనరుల శాఖ అసమర్థత సమగ్ర అవగాహనా రాహిత్యం తప్ప మరొకటి కాదు. గోదావరి అంతర్ రాష్ట్ర నది. ఈ విషయం బడిపిల్లలకు తెలుసు. ఆలాంటప్పుడు తెలంగాణ గాని ఆంధ్ర ప్రదేశ్ గాని ఏక పక్షంగా గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి అవకాశం లేదనే అంశం రాష్ట్ర జల వనరుల శాఖ పరిగణనలోకి తీసుకోలేదంటే ఏమని భావించాలి? తెలంగాణ పలు ప్రాజెక్టులు తల పెట్ట లేదా అంటే ఆ ముచ్చట తర్వాత చెబుతాను. గోదావరి బనకచర్ల అనుసంధానం గురించి తరచూ ఆదేశాలు ఇస్తుండిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జల వనరులు శాఖ ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ అధికారులు మున్ముందు ఎదురయ్యే అగడ్తల గురించి నివేదించ లేదా? ఇంజనీరింగ్ అధికారులు నివేదించినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదా? బనకచర్ల అనుసంధానం వలన తమకు అదనంగా లాభించేదేమీ లేదని రాయలసీమ వాసులు మొత్తుకొంటున్నా పట్టించుకొన్న వారు లేరు. తుదకు గోదావరి పెన్నా అనుసంధానం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడింది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాష్ట్ర విభజన చట్టం ఒకటుంది. కృష్ణ గోదావరి నదులపై ఏ రాష్ట్రమైనా కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే ముందుగా ఆయా నదీ యాజమాన్య బోర్డుకు ప్రతి పాదనలు పంపాలి. తదుపరి అపెక్స్ కౌన్సిల్ ఆమోదించాలి. ఈ తతంగం పూర్తయిన తర్వాత కేంద్ర జల సంఘం డి పి ఆర్ ఆమోదించిన తర్వాత లేదా ఏక కాలంలో పర్యావరణ శాఖ అనుమతులు ఇస్తుంది. ఇది సాఫీగా సాగే ప్రక్రియ. ఇంత తతంగం ఉందని ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రజా రైతు సంఘాల నేతలు వ్యక్తులు మొత్తుకున్నా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గానీ రాష్ట్ర జల వనరుల శాఖ గాని పట్టించుకొన్న దాఖలా లేదు.
“అయితే కేసీఆర్ చాక చక్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిపాదించబడిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్ రీ ఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు చూపెట్టి కేంద్రం వద్ద అన్ని అనుమతులు పొందారు. అదొక్కటే కాదు. ఈ విధంగా పలు పథకాలు నిర్మాణం చేపట్టబడ్డాయి. ఈ వెసులుబాటు ఆంధ్ర ప్రదేశ్ కు లేదు. ఈ తరహా పథకాల గురించి ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ నేతలు ప్రస్తావించడమంటే అసమర్థత బయట పెట్టుకోవడం తప్ప వేరు కాదు. అసలు గోదావరి లో శ్రీ రామ సాగర్ కింద భాగంలో ఎంత నీరు లభ్యత ఉందో కేంద్ర జల సంఘం వద్ద కూడా నిర్దిష్టమైన గణాంకాలు లేవు. ఒక్కో దఫా ఒక్కోరకమైన గణాంకాలు వెల్లడైన సందర్భముంది. అంతెందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ చేపట్టిన గోదావరి కావేరి అనుసంధానం పథకానికి గోదావరిలో మిగులు నీళ్లు లేవని కేంద్ర జల సంఘం నివేదించి ఉంది.”
గమనార్హమైన అంశమేమంటే ఈ బలహీనతలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నేతలు ఉపయోగించుకొని యాగీ చేసేందుకు ఇంధనంగా మార్చుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ముందుగా కేంద్ర జల సంఘం అనుమతి తీసుకోమని సూచించారు. మరో కీలక మైన అంశం స్పష్టం చేసింది. గోదావరి లో వరద జలాలు ఎన్ని ఉన్నాయో కేంద్ర జల సంఘం తేల్చ వలసి ఉందని కూడా నిపుణుల కమిటీ సూచించింది. ఈ కథాకమామీషు క్షుణ్ణంగా పరిశీలించితే ఆంధ్ర ప్రదేశ్ వేపు పలు బలహీనతలు వున్నాయి. 2020 లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే గోదావరి నదిలో రెండు తెలుగు రాష్ట్రాల నీటి వాటాలు తేల్చేందుకు ట్రిబ్యునల్ నియామకం గురించి తీర్మానం చేశారు.
కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కేంద్రం ప్రభుత్వం పై కించిత్తు ఒత్తిడి కూడా తీసుకు రాలేదు. మరో వైపు కెసిఆర్ పట్టుబట్టి కృష్ణ ట్రిబ్యునల్ కోసం గట్టిగా కృషి చేశారు. దానికి తోడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తను లబ్ది పొందేందుకు ట్రిబ్యునల్ నియామకం చేసింది. కానీ గోదావరి ట్రిబ్యునల్ ఊసే లేకుండా పోయింది. ట్రిబ్యునల్ నియామకం జరిగి ఉంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఈ ఉద్రిక్తతలు ఉండేవి కావు. తదుపరి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ట్రిబ్యునల్ అంశంపై కేంద్రం వద్ద పట్టుదలగా కృషి చేసిన దాఖలా లేదు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం జరిగిన వెంటనే ట్రిబ్యునల్ నియామకం జరిగి ఉంటే ఈ పాటికి ఎవరి వాటా ఎంతో తేలిపోయి ఉండేది. మిగులు లేక వరద జలాలపై ఎవరికి హక్కు ఉంటుంది కూడా స్పష్టత ఏర్పడి ఉండేది.
అయితే కేసీఆర్ చాక చక్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిపాదించబడిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్ రీ ఇంజనీరింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు చూపెట్టి కేంద్రం వద్ద అన్ని అనుమతులు పొందారు. అదొక్కటే కాదు. ఈ విధంగా పలు పథకాలు నిర్మాణం చేపట్టబడ్డాయి. ఈ వెసులుబాటు ఆంధ్ర ప్రదేశ్ కు లేదు. ఈ తరహా పథకాల గురించి ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ నేతలు ప్రస్తావించడమంటే అసమర్థత బయట పెట్టుకోవడం తప్ప వేరు కాదు.
అసలు గోదావరి లో శ్రీ రామ సాగర్ కింద భాగంలో ఎంత నీరు లభ్యత ఉందో కేంద్ర జల సంఘం వద్ద కూడా నిర్దిష్టమైన గణాంకాలు లేవు. ఒక్కో దఫా ఒక్కోరకమైన గణాంకాలు వెల్లడైన సందర్భముంది. అంతెందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ చేపట్టిన గోదావరి కావేరి అనుసంధానం పథకానికి గోదావరిలో మిగులు నీళ్లు లేవని కేంద్ర జల సంఘం నివేదించి ఉంది . ఈ పూర్వ రంగంలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రభుత్వాల స్థాయిలోనే కాకుండా తెలుగు సోదరుల మధ్య ఉద్రిక్తత నివారణకు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడమొక్కటే ఆశా కిరణంగా ఉంది .
వి. శంకరయ్య