చివరి విద్యార్థికి పుస్తకాలు, యూనిఫారం, షూస్ అందాలి
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 1: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యాసంస్థల్లోని ప్రతి విద్యార్థికి పుస్తకాలు, యూనిఫారం, షూస్ వంటి అన్నింటినీ అందించాలని ఉప ముఖమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. మహాత్మా జ్యోతిరాపు ఫూలే ప్రజా భవన్‌లో సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీల అధికారులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చివరి విద్యార్థికి కూడా మౌలిక అవసరాలు అందించాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. పంపిణీ విషయంలో అధికారలు వేగం పెంచాలన్నారు. పాఠశాలలు ప్రారంభం రోజునే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారం, షూస్ అందించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుందని, అందుకనుగుణంగా అధికారులంతా పనిచేయాలని ఆదేశించారు. ఒక్కో ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి పరిధిలో ఎన్ని పాఠశాలలు, గురుకులాలు ఉన్నాయి.. వాటిలో ఎన్నింటికి యూనిఫారం, పుస్తకాలు, షూస్ అందించారో స్పష్టంగా అన్ని వివరాలతో లిఖిత పూర్వకంగా రేపటిలోగా అందించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి, ఇతర కార్యదర్శలు పాల్గొన్నారు.