హాస్టల్స్‌ విజిట్‌ క్యాలెండర్‌ రూపొందించాలి

అద్దె భవనాల్లో వసతులపై సమీక్షించండి
సంక్షేమ విద్యార్థుల హెల్త్‌ రికార్డ్‌ రూపొందించాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 1: సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పర్యటన, సమీక్షపై పకడ్బందీ క్యాలెండర్‌ రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజాభవన్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌తో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ అధికారి, ఏ రోజు పర్యటించారు.. వారు పరిశీలించిన అంశాలు ఏమిటి అనేవాటిపై ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించాలని భట్టి సూచించారు. ఈ పర్యటన కార్యక్రమం నిరంతరం సాగాలని, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను సైతం పర్యటనకు ఆహ్వానించాలని అధికారులకు సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పెంచిన 40 శాతం డైట్‌, 200శాతం కాస్మోటిక్‌ చార్జీలను పెంచి, డాక్టర్ల సూచన మేరకు పకడ్బందీ మెనూ ఖరారు చేసిందన్నారు. ఈ మెనూ అన్ని సంక్షేమ హాస్టల్స్‌, గురుకులాల్లో ప్రముఖంగా కనిపించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. వసతి గృహాల అదే భవనాల్లో వసతులు ఎలా ఉన్నాయి, భవనాలు, యజమానుల వివరాల తో ఒక నివేదిక రూపొందించాలని సూచించారు. అన్ని వసతి గృహాల్లో దోమతెరలు ఏర్పాటు చేయాలని, రన్నింగ్‌ వాటర్‌ సప్లైలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ఉన్న విద్యార్థులందరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్‌ కార్డులు రూపొందించాలని డిప్యూటీ సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అధికారులను సమన్వయం చేసుకొని హెల్త్‌ కార్డు లు రూపొందించే కార్యక్రమం వేయంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం ఏర్పడితే ఆన్లైన్‌ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్‌ ఆసుపత్రులు సంసిద్ధంగా ఉన్నాయని, వారి సేవలను వినియోగించుకోవాలని  సూచించారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల భవనాలన్నిటిపైన సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ అవసరాలు తీర్చుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకో వాలన్నా రు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ అమలు తీరు, సొసైటీల వారిగా  ప్రగతిపై సమీక్షించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా , ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని, సాంఘిక సంక్షేమ శాఖ డిడి క్షితిజ, మైనార్టీ వెల్ఫేర్‌ కమిషనర్‌ షఫీ, బీసీ గురుకుల సెక్రెటరీ సైదులు, ఎస్టి గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ సర్వేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page