– కాళేశ్వరం ఆన్ చేయకుండా పంటలను ఎండబెట్టారు
– రేవంత్ కేవలం రెన్యువల్ సీఎం
– కాంగ్రెస్ దోపిడీకి వేదికగా తెలంగాణ
– 11న నిర్మల్ లో భారీ బహిరంగ సభ
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలన, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలు, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నదుల్లో నీళ్లు పారుతున్నా వాటిని సాగుకు వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారని, అందుబాటులో ఉన్న నీటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తెలంగాణ భవన్లో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో మంగళవారం చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని ఎప్పుడు చేసుకుందామా అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారన్నారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి సదుపాయాలు అందించామని కేటీఆర్ గుర్తు చేశారు. రైతుబంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచామన్నారు. కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఆదుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు వాటి అమలుపై ప్రశ్నిస్తే తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయలేకపోతే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాలని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు. మూడు నెలల్లోనే అన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. కరువు పరిస్థితులు ప్రకృతి వల్ల మాత్రమే ఏర్పడినవి కావని, నీటి నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని కేటీఆర్ ఆరోపించారు. జూన్ 19న కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించినప్పుడు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోందని, పంపులు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వాన్ని కోరామని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తే ప్రాజెక్టుపై ఇంతకాలం చేసిన ఆరోపణలు తప్పని తేలిపోతాయనే భయంతోనే బటన్ నొక్కడం లేదని ఆరోపించారు. దేవుడు ప్రజల కోసం నీళ్లు పంపిస్తే మధ్యలో పూజారి రేవంత్ రెడ్డి అడ్డుపడి బటన్ నొక్కలేదని వ్యాఖ్యానించారు. గోదావరి నుంచి 750 టీఎంసీలు, కృష్ణా నుంచి 250 టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్లిందని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ నీటిని వినియోగించుకుని ఉంటే కోటి ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండేదన్నారు. ఒకవైపు పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబంధు సకాలంలో అందడం లేదని, కరెంటు, యూరియా, సాగునీటి సమస్యలు మరింత తీవ్రంగా మారాయని విమర్శించారు. రైతుల కష్టాలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. నెలనెలా దిల్లీకి వెళ్లి ఈఎంఐ కట్టడానికే ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అని వ్యాఖ్యానించారు. రైతులకు రైతుబంధు పడకపోయినా రాహుల్ బంధు మాత్రం సమయానికి అందుతోందని వ్యంగ్యంగా అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దోపిడీ వేదికగా మారిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. దిల్లీలో బీజేపీ ప్రజలను విభజించడంలో బిజీగా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలను దోచుకోవడంలో బిజీగా ఉందని వ్యాఖ్యానించారు.
ఇక్కడ గెలిచిన వారు నియోజకవర్గానికి ఏమి సాధించావారు
నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గొడం నగేష్ గెలిచినా నియోజకవర్గానికి ఏమి సాధించారని ప్రశ్నించారు. నిర్మల్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, చెక్‌డ్యామ్‌లు, ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని గుర్తు చేశారు.పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డి అధికారం కోల్పోగానే పార్టీని వీడారని విమర్శించారు. అవకాశవాదులు పార్టీని వీడినా పోరాటవాదులు బీఆర్ఎస్లోనే ఉన్నారన్నారు. తెలంగాణను ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేయాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ మళ్లీ గట్టెక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కువ సమయం లేదని, మరో ఏడాదిలో రాజకీయ పరిస్థితులు మారుతాయని వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మళ్లీ అభివృద్ధి, సంక్షేమ బాటలోకి వస్తుందని అన్నారు. నిర్మల్‌లో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రామచరణ్ నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలను విస్తరించాలని, యువ నాయకులు అనిల్ జాదవ్, జాన్సన్ రాథోడ్ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. నవంబర్ 11న నిర్మల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభలో మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు తగిన బాధ్యతలు అప్పగించే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





