పశ్చిమ బెంగాల్ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను అసాధారణంగా పెంచడం వెనుక ఉన్న రాజకీయ చతురత ప్రజలకు అర్థం కానిది కాదు. వోట్ల వేట ముగియగానే ధరల బాదుడు మొదలుపెట్టడం అనేది వోటరును కేవలం ఒక సంఖ్యగా పరిగణించడమే. ఇది పరోక్షంగా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య.
రూ. 993 సిలిండర్ ధర పెరగడం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. హైదరాబాద్‌లో 3315 రూపాయలకు కమర్షియల్ సిలిండర్ ధర అంటే రెస్టారెంట్లు, హోటళ్లు మూత వేసుకునే పరిస్థితి వొస్తుంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే లక్షల మంది కార్మికుల ఉపాధికి ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే ఇరాన్ – అమెరికా యుద్ధం పేరుతో హోటళ్లలో, రెస్టారెంట్లలో పనిచేసే వారి పరిస్థితి, వాటిపై ఆధారపడిన వ్యక్తుల ఉపాధి తగ్గిపోయింది. చివరికి బ్యాచిలర్లు వాడే చిన్న సిలిండర్‌ను కూడా మోదీ వొదిలిపెట్టలేదు. పెంచిన గ్యాస్ ధరతో రోజువారీ టిఫిన్, భోజనం ఖర్చులు భారీగా పెరిగి అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఒకవైపు రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంది, మరోవైపు సిలిండర్ల ధర ఆకాశంలోకి పోతుంది. ఒకప్పుడు ఉద్యోగాలు అడిగితే పకోడీలు వేసి అమ్మడం కూడా ఒక ఉపాధి అన్న ప్రధాన మంత్రి మోదీ, ఈ పెంచిన సిలిండర్లతో పకోడీలు కూడా వేసుకోలేని పరిస్థితికి తీసుకువొచ్చారు .
కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను అసాధారణంగా రూ. 993 పెంచడం కేవలం వ్యాపార వర్గాలనే కాకుండా, దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల కడుపుపై కూడా కొడుతోంది. ఈ ధరల పెంపుతో 19 కేజీల సిలిండర్ రూ. 3,000 మార్కును దాటడం అనేది సామాన్యుడి బతుకు భారానికి పరాకాష్ట. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థుల డ్రాపౌట్స్ తగ్గించడానికి, వారికి పౌష్టికాహారం అందించడానికి ప్రవేశపెట్టిన ‘మధ్యాహ్న భోజన పథకం’ ఇప్పుడు ఈ ధరల పెరుగుదల వల్ల తీవ్ర సంక్షోభంలో పడుతుంది. ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి ఇచ్చే నిధులు చాలా పరిమితంగా ఉంటాయి. ఒక్కసారిగా గ్యాస్ ధర 30-35% పెరగడంతో, వంట ఏజెన్సీలకు కేటాయించే బడ్జెట్ ఏ మాత్రం సరిపోదు. గ్యాస్ ధరల భారాన్ని భరించలేక, చాలా చోట్ల వంట నిర్వాహకులు కూరగాయలు, గుడ్లు వంటి పౌష్టికాహారంలో కోత విధించే అవకాశముంది.. ఇది విద్యార్థుల్లో రక్తహీనత మరియు పోషకాహార లోపానికి దారితీసే ప్రమాదం ఉంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజన వంట కార్మికులకు గౌరవ వేతనాలు, గ్యాస్ బిల్లుల రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు సిలిండర్ రూ. 3,000 దాటడంతో, వారు అప్పుల పాలయ్యే పరిస్థితి నెలకొంది.
హోటళ్లు, కేఫ్‌లే కాకుండా రోడ్డు పక్కన బండి మీద టిఫిన్లు అమ్ముకునే వారు, చాయ్ బండి వారు ఈ నిర్ణయంతో రోడ్డున పడే పరిస్థితి వొచ్చింది. గ్యాస్ ధర పెరిగితే వారు ఆహార పదార్థాల ధరలు పెంచాలి, కానీ అలా పెంచితే సామాన్య కస్టమర్లురారు. ఫలితంగా చిన్న తరహా వ్యాపారాలు మూతపడి నిరుద్యోగం మరింత పెరిగే ప్రమాదం ఉంది. “మేము పెంచింది కమర్షియల్ గ్యాస్ ధరలే కదా” అని పాలకులు తప్పించుకోవొచ్చు. కానీ మార్కెట్‌లో ప్రతిదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది: కమర్షియల్ గ్యాస్ ధర పెరిగితే అది రవాణా, లాజిస్టిక్స్ మరియు సేవల రంగాలపై ప్రభావం చూపుతుంది. బయట తినడం ఖరీదైన వ్యవహారంగా మారుతుంది, ఇది మధ్యతరగతి మరియు శ్రామిక వర్గాల పొదుపును హరిస్తుంది.
ప్రభుత్వం కేవలం గణాంకాలతో మాయ చేయకుండా వాస్తవ పరిస్థితులను గమనించాలి. విద్యాసంస్థలు మరియు మధ్యాహ్న భోజన పథకాలకు వాణిజ్య ధరల నుండి మినహాయింపు ఇచ్చి, వారికి రాయితీపై గ్యాస్ అందించాలి. గ్యాస్ సిలిండర్లపై ఉన్న పన్నులను తగ్గించి ధరను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావాలి.
అభివృద్ధి అంటే కేవలం భవనాలు, రోడ్లు కాదు; ప్రజల కడుపు నిండడం. విద్యార్థుల భోజనం పై, పేదవాడి బతుకుదెరువు పై దెబ్బకొట్టే ఏ నిర్ణయమైనా అది ప్రజా వ్యతిరేక నిర్ణయమే అవుతుంది. కేంద్రం తన మొండి వైఖరిని వీడి, ఈ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేనిపక్షంలో, పెరుగుతున్న ఈ సెగ ప్రభుత్వ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తుంది.