సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

– ఉద్యోగ సంఘాలతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన శుక్రవారం సాయంత్రం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల విన్నపాలను సావధానంగా విన్న ఆయన వారి సమస్యలపై సానుకూల హామీ ఇచ్చారు. ఉద్యోగుల సేవలను కొనియాడుతూ ఉప ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉద్యోగులు ఒక వారధిలా పనిచేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల గడప వద్దకు చేరుతున్నాయంటే అందులో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకం అని భట్టి విక్రమార్క ప్రశంసించారు.

ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక క్రమశిక్షణతోపాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంపై సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయని, దీనివల్ల వేలాది కుటుంబాలకు ఊరట లభిస్తోందంటూ వారు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బెనిఫిట్స్ చెల్లించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.1,000 కోట్లు కేటాయించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. భేటీ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రధానంగా పీఆర్సీ, కరవు భత్యం, హెల్త్ కార్డుల వంటి దీర్ఘకాలిక సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన ఈ అంశాలన్నింటినీ కేబినెట్ సబ్ కమిటీలో సమగ్రంగా చర్చించి త్వరలోనే ఉద్యోగులకు చెబుతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని, మీ విన్నపాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. మీ సమస్యలు, ఇతర అంశాలపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చిస్తామన్నారు. త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సమావేశంలో టీజీఈజేఏసీ నేతలు మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు, దేవరకొండ సైదులు, టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో వి.రాజశేఖర్, సెక్రటరీ జనరల్, టీజీఈ జేఏసీ భాగస్వామ్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కె.రామకృష్ణ, ఎస్.రాములు, బాణాల రాంరెడ్డి, పెంటయ్య, రమేష్ పాక, డాక్టర్ నిర్మల, ఎండీ హబీబ్ మియా, కె.మహిపాల్ రెడ్డి, దర్శన్ గౌడ్, వి,బిక్షం, ఉపేందర్ రావు, ఎన్.రాబర్ట్ బ్రూస్, డాక్టర్ ఎ.సైదులు, జె.బుచ్చయ్య, కె.కుమార స్వామి, ఎస్‌కే.హబీబ్ మియా, వెంకటేశం, వివేక్, మమత, క్రాంతి కుమార్, రవి, నరేందర్, స్వామి, దేవిక, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *