పాడైపోయిన హైదరాబాద్

హైదరాబాద్ నగరంలో శుక్రవారం రాత్రి నమోదైన 28.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, దేశంలోనే అత్యధిక రాత్రి ఉష్ణోగ్రతగా నిలవడం ఆందోళన కలిగించే అంశం. నగర జీవితం ఒకప్పుడు చల్లని సాయంత్రాలకు, ఆహ్లాదకరమైన రాత్రులకు మారుపేరుగా ఉండేది.  1960-70 ల మధ్య  హైదరాబాద్  స్వచ్ఛమైన గాలిని, ప్రశాంతమైన మనసును ప్రసాదించే నగరం. ఆధునికత తక్కువగా ఉన్నా, జీవన నాణ్యత,ఆరోగ్యకర వాతావరణం, ఎండాకాలం ఇంటి ఆరుబయట లేదా పైన చల్ల గాలులను అనుభవిస్తూ ప్రశాంతంగా పడుకునే రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆనాటి పాతబస్తీ సందులు, కొత్తగా విస్తరిస్తున్న కాలనీలు అన్నీ ఒక రకమైన మాయాజాలాన్ని సృష్టించేవి. ఆ మధుర జ్ఞాపకాలు నేటికీ ఎందరో నగరవాసుల గుండెల్లో పదిలంగా ఉన్నాయి.వలసలు ప్రశాంతమైన భాగ్యనగరాన్ని ధ్వంసం చేసినాయి.నేడు పరిస్థితి తలకిందులైంది.
శుక్రవారం రాత్రి హైదరాబాద్‌ లో నమోదైన 28.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, అది మన పర్యావరణ వ్యవస్థ ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభానికి హెచ్చరిక. దేశంలోనే అత్యధిక రాత్రి ఉష్ణోగ్రత కలిగిన నగరంగా హైదరాబాద్ నిలవడం వెనుక అనేక మానవ తప్పిదాలు, భౌగోళిక మార్పులు దాగి ఉన్నాయి.
హైదరాబాద్ రాత్రుళ్లు వేడెక్కడానికి ప్రధాన కారణం ‘అర్బన్ హీట్ ఐలాండ్’ ప్రభావం. పగటిపూట సూర్యుడి నుంచి వొచ్చే వేడిని కాంక్రీట్ కట్టడాలు, తారు రోడ్లు, గాజు భవనాలు విపరీతంగా పీల్చుకుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు, ఖాలీ  భూమి ఉండటం వల్ల రాత్రి కాగానే వేడి త్వరగా విడుదలవుతుంది. కానీ, హైదరాబాద్ వంటి నగరాల్లో దట్టమైన భవనాల వల్ల ఈ వేడి బయటకు పోలేక గాలిలోనే ఉండిపోతుంది. ఫలితంగా పగటి వేడి రాత్రి కూడా కొనసాగుతూ, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి.
 హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, చార్మినార్‌ పరిసరాలు వేడి నిల్వ ప్రాంతాలుగా మారుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో 40డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. న్యూ నాగోల్‌లో 41.7, ముషీరాబాద్‌లో 41.6, చార్మినార్‌, సంతోష్‌నగర్‌లో 41.5 డిగ్రీలు వరకు నమోదయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో నిర్మించిన భారీ గ్లాస్ ఫాసాడ్ (అద్దాల) భవనాలు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. ఈ అద్దాలు సూర్యరశ్మిని పరావర్తనం  చెందించడమే కాకుండా, లోపల ఉన్న వేడిని నియంత్రించడానికి భారీ ఏసీలను ఉపయోగిస్తాయి. ఈ ఏసీలు బయటకు వదిలే వేడి గాలి నగర వాతావరణాన్ని రాత్రిపూట కూడా వేడిగానే ఉంచుతోంది.
గత రెండు దశాబ్దాల్లో హైదరాబాద్ విస్తరణ అద్భుతంగా ఉన్నప్పటికీ, ఆ క్రమంలో మనం సహజ సిద్ధమైన చెరువులను, చెట్లను కోల్పోయాము. ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి వంటి శివారు ప్రాంతాలు ఇప్పుడు పూర్తిస్థాయి కాంక్రీట్ అడవులుగా మారాయి. నేల అంతా సిమెంట్, తారుతో నిండిపోవడం వల్ల భూమి చల్లబడే ప్రక్రియ పూర్తిగా మందగించింది. ప్రస్తుతం రాష్ట్రం మీదుగా వీస్తున్న పొడి గాలులు కూడా ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉండటం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిని చేరుతున్నాయి. గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల రాత్రిపూట కూడా ఉపశమనం లభించడం లేదు. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏప్రిల్ లో సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. నిర్మాణ రంగం నుంచి వచ్చే దుమ్ము, వాహనాల నుంచి వొచ్చే పొగ వాతావరణంలో ఒక పొరలా ఏర్పడుతున్నాయి. ఈ పొర భూమి నుంచి వెలువడే వేడిని ఆకాశంలోకి పోనివ్వకుండా అడ్డుకుంటోంది . ఇది నగర గాలిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉక్కపోతను పెంచుతోంది.ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హైదరాబాద్ రాత్రులు జీవనయోగ్యం కాకుండా పోయే ప్రమాదం ఉంది.
  రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం మరింత ప్రమాదకరం. పగటి వేడి తర్వాత శరీరం రాత్రి చల్లబడాలి. కానీ కనిష్ఠ ఉష్ణోగ్రత 28–29డిగ్రీలు  వద్దే నిలిస్తే వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు, బస్తీల్లో నివసించే పేదలు, రోడ్లపై పనిచేసే కార్మికులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఐఎండి  కూడా రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే మరుసటి రోజు గరిష్ఠ ఉష్ణోగ్రతల ప్రభావాన్ని పెంచుతాయని వివరిస్తుంది. అధిక ఉష్ణోగ్రతల నివారణ చర్యల్లో భాగంగా  “గ్రీన్ కవర్ “పెంచడానికి   మియావాకీ పద్ధతిలో నగరంలోని ప్రతి ఖాలీ  స్థలంలో చెట్లను నాటాలి.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కూల్ రూఫ్ విధానాన్ని ప్రతి ఇల్లు, భవనం తప్పనిసరిగా పాటించేలా చూడాలి. ఇది భవనాల్లో వేడిని 2-4 డిగ్రీల వరకు తగ్గిస్తుంది. మూసీ నదితో పాటు నగరంలోని గొలుసుకట్టు చెరువులను కాపాడుకోవడం ద్వారానే వాతావరణాన్ని చల్లబరచడం సాధ్యమవుతుంది. హైదరాబాద్ రాత్రి ఉష్ణోగ్రతలు 28.5 డిగ్రీలకు చేరడం అనేది ప్రకృతి మనకు ఇస్తున్న ముందస్తు హెచ్చరిక. అభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాలు  మాత్రమే కాదు, ప్రజలు ప్రశాంతంగా గాలి పీల్చుకునే వాతావరణం కూడా అని పాలకులు, ప్రజలు గుర్తించాలి. లేనిపక్షంలో భాగ్యనగరం ఒక శాశ్వత నిప్పుల కొలిమిగా మారిపోయే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *