బిఆర్‌ఎస్ పార్టీ తమ రజ తోత్సవ ముగింపు వేడుకలను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంది. ఊరూర బిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు పార్టీ జండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ అధినేత కేసిఆర్ స్వయంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యవర్గ సభ్యులతో భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమానికి దిశనిర్ధేశం చేశారు. ఈ 25 వసంతాల్లో పార్టీ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కుంది. ఎన్నో మైలు రాళ్ళను దాటింది. మరెన్నో విజయాలను కూడా హస్తగతం చేసుకుంది.
2001లో ఆ పార్టీ పుట్టననాడు మఖలో పుట్టి పుబ్బలో మాయమవుతుందంటూ చాలమంది తేలిగ్గా కొట్టిపారేశారు. కాని, అకుంటిత దీక్షతో యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే విధంగా ఉద్యమలక్ష్యాన్ని ముద్దాడి, సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పాలించి చరిత్రలోనే ఒక అధ్యాయాన్ని ఆపార్టీ లిఖించుకుంది. తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడటం ఒక్క టిఆర్‌ఎస్ వల్లే సాధ్యమన్న అభిప్రాయాన్ని ఇక్కడి ప్రజల్లో కలిగించింది. ప్రజలు పరాయిపాలనలో ఏం కోల్పోయారో వాటిని ఇక్కడి ప్రజలు పొందేందుకు అధికారంలోకి రాగానే వివిధ పథకాల పేర ప్రజలకు చేయూతనందించి, ఔరా అనిపించుకుంది.
తన ఆలోచనను రాష్ట్రానికే పరిమితం చేస్తే తిరుగులేని రాజకీయ పార్టీగా నేటికీ ఆ పార్టీ అధికారంలో కొనసాగేది. కాని దేశ రాజకీయాలపై దృష్టిపెట్టి నాటి టిఆర్‌ఎస్ పార్టీని బిఆర్‌ఎస్‌గా మార్పుచేసినప్పటినుండి దానికి కష్టకాలం మొదలైంది. 2023లో అధికారానికి దూరమైంది. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సున్నా స్థానాలను గెలచుకుంది. ఫలితంగా పదిమంది ఎమ్మెల్యేలు ఫిరాయించడానికి కారణమైంది. దానికి తోడు కాళేశ్వరం కాలనాగైంది. ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్క్యాం, గొర్రెల పంపణీలో అవినీతి అంటూ అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ పార్టీ గడచిన రెండున్నర ఏండ్లుగా ఆ పార్టీని ఊపిరి మెసలకుండా చేస్తున్నది. ప్రాంతీయపార్టీ అయిన బిఆర్‌ఎస్ మొదటినుండీ రెండు జాతీయ పార్టీలను ఎదుర్కోవాల్సి వొచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని బిజెపి సహకరించకపోవడంతో అనేక సందర్భాల్లో ఆపార్టీ నేతలతో గొడవపడాల్సి వొచ్చింది.
బిజెపితోపాటు కాంగ్రెస్ కూడా నిత్యం అవినీతి ఆరోపణలతో బిఆర్‌ఎస్‌ను దోషీగా ప్రజలముందు నిలబెట్టడంలో ఏ ఒక్క అవకాశాన్ని ఒదులుకోవడంలేదు. రెండు జాతీయ పార్టీలకు తోడు ఇప్పుడు కొత్తగా మరో ప్రాంతీయ పార్టీని భవిష్యత్‌లో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది. కన్న కూతురే పక్కలో బల్లెంలా తయారైంది. తన పార్టీకి టిఆర్‌ఎస్‌గా నామకరణంచేసి, ఉద్యమపార్టీ అయిన బిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలని లక్ష్యంగా ముందుకు పోతున్నది. కన్న తండ్రి, అన్నమానవ సంబంధాలు రాజకీయల్లో పనిచేయవన్నట్లుగా గత రెండు రోజులుగా ఆమె వారిని టార్గెట్ చేస్తున్నది.
దేశంలోనే రాజనీతిజ్ఞుడిగా పేరు తెచ్చుకున్న కెసిఆర్‌ను మరబొమ్మగా పేర్కొందంటేనే తన సొంత కుటుంబ సభ్యులనే ఏమేరకు ద్వేషిస్తున్నదన్నది అర్థమవుతున్నది. ఇంతవరకు రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల ముక్కోణపు పోటీ మాత్రమే ఉండేది. ఎన్నికల మైదానంలో కవిత పార్టీ నిలదొక్కుకుంటే ..ఇకనుండి చతుర్ముఖ పోటీ రాష్ట్రంలో కొనసాగబోతుంది. రానున్న ఎన్నికల నాటికి ఈ నాలుగు పార్టీల వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నది.