– తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ప్రణాళికలు
– మహారాష్ట్రలో ముంపు తగ్గింపునకు ప్రత్యామ్నాయాలు
– ఎన్డీఎసఏ మార్గదర్శనం మేరకు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలకు మరమ్మతులు
– ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
– మహారాష్ట్రలో ముంపు తగ్గింపునకు ప్రత్యామ్నాయాలు
– ఎన్డీఎసఏ మార్గదర్శనం మేరకు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలకు మరమ్మతులు
– ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : చేవెళ్ల-ప్రాణహిత వద్ద బ్యారేజ్ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకుగాను తుమ్మిడిహట్టి వద్ద తలపెట్టిన బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో సంప్రదింపులు జరిపేందుకు పూర్తిస్థాయిలో సాంకేతిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ హైదరాబాద్‌లను ఆదేశించారు. ఉభయ రాష్ట్రాలకు అనువైన పద్దతిలో ఉండేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందించడంతోపాటు అంతర్ రాష్ట్ర జల ఒప్పందాల అంశంపై మంత్రి ఉత్తమ్ బేగంపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక సన్నాహక సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ మహారాష్ట్రలోని భూభాగంతోపాటు చప్రాల వన్యప్రాణుల అభయారణ్యంలో ముంపు ప్రభావం తగ్గేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ముంపు ప్రభావిత ప్రాంతాలకు అవసరమైతే నష్టపరిహారాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి అంగీకరించిన విషయాన్ని ప్రస్తావిస్తూ తక్కువ వ్యయంతో వరద నీటి ప్రవాహాన్ని వినియోగించేలా నిర్మాణం చేపట్టేలా మార్గాలు చూడాలన్నారు. సాంకేతిక నైపుణ్యం, ఆర్థిక ప్రయోజనాలతోపాటు సమగ్రంగా అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. అంతర్ రాష్ట్ర చర్చలకు ముందే ప్రత్యామ్నాయ మార్గాలు, సాధ్యాసాధ్యాలు, ఖర్చు చేసే మొత్తంతో ఒనగూరే ప్రయోజనాలతోపాటు భూగర్బానికి సంబంధించిన సాంకేతిక వివరాలతో పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. తక్కువ వ్యయంతో ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఎల్లంపల్లి జలాశయాలతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతాల వరకు 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రూపొందించిందన్నారు. అయితే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం, అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ రీ డిజైన్‌ల పేరుతో అకారణంగా కాళేశ్వరం పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించినా ఆశించిన ప్రయోజనం చేకూరలేదన్నారు. ప్రాజెక్టు పరిధి విస్తరించినప్పటికీ ఎత్తిపోతలపై ఆధారపడడంతో విద్యుత్ చార్జీలు పెనుభారంగా పరిణమించడంతోపాటు భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు బయటపడడంతో వరద కాల్వల ద్వారా లభించే ప్రయోజనాలు నెరవేరకపోగా రంగారెడ్డి జిల్లా చివరి ప్రాంతాలకు ఎంతమాత్రం ప్రయోజనం చేకూరలేదన్నారు. చేవెళ్ల-ప్రాణహిత పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదన్నారు. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను సాధ్యమైన మేర వినియోగించుకుంటూ తక్కువ వ్యయంతో ఎల్లంపల్లి నుండి వరద కాల్వ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు దృష్టి కేంద్రీకరించామన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి, అక్కడినుంచి సుందిళ్ల వరకు అనుసంధానానికి నాలుగు ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్ ప్రతిపాదనలను ఐఐటీ హైదరాబాద్ నిపుణులు, ఆర్వీ అసోసియేట్స్‌తో కలిసి సవివరంగా పరిశీలిస్తున్నామన్నారు. భూసేకరణ తగ్గించడం, పంపింగ్ అవసరాన్ని తగ్గించడం, టన్నెల్స్, కాల్వల పొడవు తగ్గించడం, మొత్తం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను మెరుగుపరచడం ఈ అధ్యయనాల ప్రధాన లక్ష్యమన్నారు. అందుకుగాను తుమ్మిడిహట్టి ప్రాంతంలో భూగర్భ, భౌగోళిక సర్వేలు కూడా వేగంగా కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు వర్షాకాలానికి ముందే అత్యవసర మరమ్మతులు పూర్తిచేయాలని ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఈ పనులు ఎన్డీఎస్‌ఏ సాంకేతిక మార్గదర్శకత్వంలో కొనసాగనున్నాయన్నారు. ఈ మరమ్మతుల కోసం ప్రతి 1.5 మీటర్లకు ఒకసారి స్టాండర్డ్ పెనెట్రేషన్ టెస్ట్, ప్రతి 3 మీటర్లకు ఒకసారి పర్మియబిలిటీ పరీక్షలు నిర్వహించాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాతి పొర తగిలిన తర్వాత కూడా మరింత లోతుగా డ్రిల్లింగ్ చేయాలని సూచించారు. ఇందుకోసం సమన్వయ కమిటీ వెంటనే ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించి పనులకు స్పష్టమైన కాలపట్టిక రూపొందించాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే భారీ ఎత్తిపోతల ఆధారిత విధానంతో పోలిస్తే తక్కువ నిర్వహణ వ్యయంతో విశ్వసనీయంగా సాగునీరు అందించే అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సమావేశంలో నీటిపారుదల శాఖ సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఈఎన్‌సీ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





