భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఒక పండుగ వంటివని చెబుతుంటారు. కానీ, ఆ పండుగ వెనుక ఉండే రాజకీయ క్రీడలో సామాన్యుడి భద్రత, వోటు హక్కు, మరియు వాగ్దానాల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రస్తుత దేశ రాజకీయాల్లో అటు మణిపూర్ రగులుతున్నా, ఇటు బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పాలక వర్గం నిమగ్నమై ఉండటం చూస్తుంటే.. ప్రాధాన్యతలు ఎటువైపు మళ్లుతున్నాయో అర్థం చేసుకోవొచ్చు.
ఈశాన్య భారతంలో కీలకమైన మణిపూర్ రాష్ట్రం గత మూడేళ్ళుగా హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుతోంది. . తాజా హింసాత్మక ఘటనలు ఏప్రిల్ 7న ప్రారంభమయ్యాయి. ఆ రోజు బాంబు పేలుడులో ఇద్దరు పిల్లలు మరణించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు డజను మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఏప్రిల్ లో జరిగిన బాంబు దాడులు, పిల్లల మరణాలు, తాజాగా చెలరేగిన అల్లర్లు ఆ రాష్ట్రంలో ఇంకా శాంతి నెలకొనలేదని స్పష్టం చేస్తున్నాయి. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతుంటే, దేశ ప్రధాని, హోం మంత్రి మరియు రక్షణ మంత్రి వంటి అత్యున్నత పదవుల్లో ఉన్నవారు మణిపూర్ వైపు కన్నెత్తి చూడకుండా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దేశంలో ఒక రాష్ట్రం అగ్నిగుండంలా మారుతున్నప్పుడు, ఒక రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకోవాలన్న తపన కంటే మణిపూర్ లాంటి సమస్యాత్మక రాష్ట్రంలో శాంతి భద్రతల పునరుద్ధరణ ముఖ్యం కాదా? బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు వోట్ల వేటలో ఉంటే, మణిపూర్ బాధితులకు భరోసా ఇచ్చేది ఎవరు?
బెంగాల్ ఎన్నికల వేళ దాదాపు 90 లక్షల వోటర్ల పేర్ల తొలగింపు అనేది ప్రజాస్వామ్య మనుగడకే సవాలుగా నిలిచింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరిగిన ఈ ప్రక్రియపై సుప్రీంకోర్టు వరకు వివాదం వెళ్లింది. వోటు హక్కు అనేది రాజ్యాంగబద్ధమైనది మరియు ప్రజల భావోద్వేగాలకు సంబంధించింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉండటంతో వెంటనే జోక్యం చేసుకోలేమని చెబుతూనే, అప్పీలేట్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించాలని సూచించింది.





