సంక్షోభం లో విమానయాన రంగం

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, హార్మోజ్ జలసంధి వద్ద నెలకొన్న అనిశ్చితి ప్రపంచ వ్యాప్తంగా చమురు సెగలను రాజేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, దాని ప్రభావం నేరుగా భారత విమానయాన రంగంపై పడటం అత్యంత ఆందోళనకరం. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఎఫ్ఐఏ)  కేంద్ర ప్రభుత్వానికి పంపిన SOS సందేశం విమానయాన రంగం ఎంతటి దారుణమైన స్థితిలో ఉందో కళ్ళకు కడుతోంది. “భారతీయ విమానయాన పరిశ్రమ తీవ్ర ఒత్తిడిలో ఉంది, కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది” అన్న వారి హెచ్చరికను ప్రభుత్వం కేవలం ఒక విజ్ఞప్తిగా కాకుండా, ఒక ‘పరిశ్రమ మనుగడ ప్రశ్న’గా చూడాల్సిన అవసరం ఉంది.
భారత విమానయాన సంస్థల వ్యయంలో దాదాపు 40% శాతం  కేవలం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)    లేదా విమాన ఇంధనం కోసమే ఖర్చవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ విమానయాన సంస్థల బ్యాలెన్స్ షీట్లు చిందరవందర అవుతున్నాయి.
ప్రపంచ చమురు సరఫరాలో మూడొంతుల వాటా హార్మోజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఇరాన్-అమెరికా ఘర్షణల వల్ల ఈ మార్గం మూసుకుపోతే, చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయంమే  కాకుండా చమురు దిగుమతులు డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడటం ఎయిర్‌లైన్స్ కంపెనీల మీద రెట్టింపు భారాన్ని మోపుతోంది.
ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి దిగ్గజ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే ఎఫ్ఐఏ  పంపిన లేఖలోని అంశాలు పరిశ్రమ కుప్పకూలే దశకు చేరుకుందని స్పష్టం చేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా భారత విమానయాన రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది (జెట్ ఎయిర్‌వేస్ పతనం వంటివి), కానీ ప్రస్తుత పరిస్థితి అంతకంటే భిన్నమైనది మరియు ప్రమాదకరమైనది.
 ప్రపంచంలోనే అత్యధికంగా ఏటీఎఫ్  పై పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకంతో పాటు, రాష్ట్రాలు విధించే పన్నులు 30% వరకు ఉండటం సంస్థలకు భారంగా మారింది. విమానాల లీజింగ్ ధరలు, విడిభాగాల దిగుమతి, మరియు విమానాశ్రయ ఛార్జీలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.
 మార్కెట్ వాటాను దక్కించుకోవడానికి ఎయిర్‌లైన్స్ మధ్య సాగుతున్న ‘ప్రైస్ వార్’ వల్ల టికెట్ ధరలు తక్కువగా ఉంటున్నాయి, కానీ ఆదాయం మాత్రం ఖర్చులకు సరిపోవడం లేదు.
విమాన రంగంలో సంక్షోభం ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదముంది. విమానయాన రంగం కేవలం ప్రయాణాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. విమానయాన రంగం దెబ్బతింటే పర్యాటకం కుప్పకూలుతుంది. హోటళ్లు, రవాణా, స్థానిక ఉపాధిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. లక్షలాది మంది పైలెట్లు, క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్టాఫ్ మరియు ఇంజనీర్ల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఉడాన్’ వంటి పథకాలు విఫలమయ్యే అవకాశం ఉంది, తద్వారా ప్రాంతీయ అనుసంధానత దెబ్బతింటుంది.
ఎఫ్ఐఏ  కోరుతున్నట్లుగా ప్రభుత్వం వెంటనే ‘అత్యవసర జోక్యం’ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రంగం సంక్షోభం నుండి గట్టెక్కాలంటే ఏటీఎఫ్ ని జీఎస్టీ  పరిధిలోకి తీసుకురావడం.. విమానయాన రంగం సుదీర్ఘ కాలంగా కోరుతున్న ప్రధాన డిమాండ్ ఇది. ఏటీఎఫ్  ను జీఎస్టీ  పరిధిలోకి తెస్తే పన్నుల భారం తగ్గి,దేశవ్యాప్తంగా ఒకే విధమైన ధరలు అమల్లోకి వొస్తాయి.
తక్షణ ఉపశమనం కోసం కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని, రాష్ట్రాలు విధించే పన్నులను తగ్గించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక ‘లగ్జరీ’ సేవగా కాకుండా ‘అవసరమైన సేవ’గా గుర్తించాలి. బ్యాంకుల నుండి ఎయిర్‌లైన్స్ సంస్థలకు సులభతరమైన రుణాల అందజేత మరియు వడ్డీ రేట్లలో మినహాయింపులు ఇవ్వాలి. ల్యాండింగ్ మరియు పార్కింగ్ ఛార్జీలను తగ్గించడం ద్వారా సంస్థల నిర్వహణ భారాన్ని కొంత తగ్గించవొచ్చు.
విమానయాన రంగం అనేది ఒక దేశ ప్రగతికి ప్రతిబింబం. విమానాలు గాల్లో ఎగరడం ఆగిపోతే, అది కేవలం కొన్ని కంపెనీల నష్టం మాత్రమే కాదు, దేశ ఆర్థిక పురోగతికి పెద్ద బ్రేక్ పడినట్లే. అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల మన నియంత్రణలో లేకపోవొచ్చు, కానీ మన దేశీయ పన్నుల వ్యవస్థను సవరించడం మన చేతుల్లోనే ఉంది.
ప్రభుత్వం ఇప్పుడు స్పందించకపోతే, మరో ‘జెట్ ఎయిర్‌వేస్’ లేదా ‘కింగ్‌ఫిషర్’ వంటి పతనాలను మనం చూడాల్సి వొస్తుంది. “చౌకగా ప్రయాణం” అన్న నినాదం నిజం కావాలన్నా, పరిశ్రమ మనుగడ సాగించాలన్నా కేంద్ర ప్రభుత్వం SOS  సందేశానికి సానుకూలంగా స్పందించి, ధైర్యంగా సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే భారత గగనతలంపై విమానయాన రంగం సుస్థిరంగా ప్రయాణించగలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *