– మొన్న సిరిసిల్ల, నేడు సిద్దిపేట లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాలు
– రేపు సిద్దిపేటలో సీఎం రేవంత్ భారీ బహిరంగ సభ
– ఇందిర జయంతి సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం
– హరీష్ రావు బహిరంగ లేఖ, ఫ్లెక్సీల రగడతో వేడెక్కిన వాతావరణం
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్)
గులాబీ కంచుకోటలను బద్దలు కొట్టాలన్న లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది. మొన్న సిరిసిల్లలో బలప్రదర్శన చేసిన కాంగ్రెస్ నేడు సిద్ధిపేటలో తన ఉనికిని చాటుకునేందుకు సిద్దపడింది. ఉనికిని చాటుకోవడంకోసం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే సిద్ధిపేట నియోజకవర్గంలో తన్నీరు హరీష్‌రావు ఏడు సార్లు వరుసగా గెలవడంద్వారా ఆ నియోజకవర్గంలో మరో పార్టీకి తావులేదని నిరూపించారు. భారతరాష్ట్రసమితి (బిఆర్‌ఎస్) పార్టీలో ఆయనకు ఒక కీలకవ్యక్తిగా, ట్రబుల్ షూటర్‌గా ప్రత్యేక గుర్తింపుఉంది. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం ప్రతిపక్ష శాసనసభపక్ష నాయకుడిగా ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్ ఓటమి తర్వాత కెసిఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమవడంతో పార్టీ బాధ్యతలను బావమరిది కెటిఆర్‌తో కలిసి జోడెద్దుల్లా మోస్తున్నారు. కెసిఆర్‌ను మూలకు కూర్చోబెట్టినా కాడెద్దుల్లా పార్టీని ఉరకలు పెట్టిస్తున్న బావబావమరుదులను తొక్కేస్తే ఇక బిఆర్‌ఎస్ లేవదన్న భావన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలను చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డికి ఉంది. ఆ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో బహిరంగంగానే వెల్లడించారు కూడా. అందుకే అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో ఆయన ప్రధానంగా కెసిఆర్‌తోపాటు కెటిఆర్, హరీష్‌రావులను టార్గెట్‌చేస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలతోపాటు, ఈ ముగ్గురు నాయకులపై వ్యక్తిగతమైన ఆరోపణలను రేవంత్‌రెడ్డి చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ ఆవిర్భావంకన్నా ముందు ఏలాంటి ఆస్తులులేని ఈ నాయకులకు కోట్లాది ఆస్తులు ఎలా సంక్రమించాయన్న విషయాన్ని ప్రతీ సమావేశంలో లేవనెత్తడంద్వారా వారిని ప్రజలముందు అక్రమార్కులుగా ముద్రవేసేవిషయంలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడంలేదు. ప్రధానంగా తమ పాలనపై వేలెత్తి చూపడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం సహించలేకపోతున్నది. మొన్నటికిమొన్న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ నియోజకవర్గం సిరిసిల్లలో కాంగ్రెస్ తన విశ్వరూప ప్రదర్శన చేసింది. లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్న ఈ సభలో కెటిఆర్ ఎంతటి అవినీతిపరుడన్న విషయాన్ని వివరించే ప్రయత్నంచేశారు సిఎం రేవంత్‌రెడ్డి. ఉద్యమకాలంలో తమ కుటుంబానికి ఉండేందుకు సరైన ఇల్లు లేదని చెప్పిన కెటిఆర్‌కు హైదారాబాద్‌లో ఫైస్టార్ బంగ్లాలు ఎలావచ్చాయంటూ నిలదీశారు. ఉద్యమంలో విద్యార్థులు బలిదానాలు చేసుకుంటుంటే కెసిఆర్ తన వ్యాపారాన్ని విస్తరించుకోవడాన్ని వేలెత్తి చూపిన రేవంత్‌రెడ్డి, కెటిఆర్ జుట్టు పెంచుకోవడాన్ని, గడ్డంపెంచుకోవడంపైన కూడా సెటైర్లు విసరడం చూశాం. ఇది కేవలం రాజకీయంగానే కాకుండా మానసికంగా బిఆర్‌ఎస్ నేతలను ఇబ్బందులకు గురిచేసే ప్రక్రియనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు గెలిస్తే వారికి మంత్రి పదవి ఖాయమనడం సిరిసిల్లపై కాంగ్రెస్ జండా ఎగురవేయాలన్న ఆయన లక్ష్యాన్ని చెప్పకనే చెబుతున్నది. ఇప్పుడు హరీష్‌రావుపైన కూడా అలాగే మాటలదాడి చేసే అవకాశం లేకపోలేదు. నిరంతరం కాంగ్రెస్ పాలనను నిలదీస్తున్న హరీష్‌రావు రేవంత్‌రెడ్డికి కెటిఆర్‌కన్న ప్రధాన టార్గెట్‌గా ఉన్నారు. ఆయన్ను పార్టీనుండి వేరుచేస్తే బిఆర్‌ఎస్ ఇబ్బందులకు గురవుతుందన్న భావనతో ఆనేకసార్లు పార్టీలో ఆయన ఉనికిపై రేవంత్‌రెడ్డి దాడిచేసిన విషయం తెలియందికాదు. కాంగ్రెస్ ఒక్కటేకాదు, ఇతర పార్టీలుకూడా హరీష్‌రావును టార్గెట్‌గా చేసుకున్నాయి. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కూతురు, కెటిఆర్ చెల్లెలు, హరీష్‌రావు మరదలుకూడా అయిన కల్వకుంట్ల కవిత ఈ మధ్య ఆయనపైన తీవ్రాతితీవ్రంగా ఆరోపణలు చేస్తున్నది. ఆయన ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఇటీవల బాహాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డే ఆమెతో ఇలా అనిపిస్తున్నారన్న ప్రచారంకూడా లేకపోలేదు. ఏదిఏమైనా గురువారం సిద్ధిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని‘ఇందిర బీమా పథకాన్ని’ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రకటించనుంది. ఈ పథకాన్ని ప్రకటించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధిపేటనే ఎంచుకోవడం వెనుక ప్రధానంగా హరీష్‌రావు లక్ష్యంగానే అన్నది సుస్పష్టం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడాన్ని ప్రశ్నిస్తున్న హరీష్‌రావును ఈ సభాముఖంగా మరింత టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదన్న చర్చ జరుగుతున్నది. సిఎం రేవంత్‌రెడ్డి సిద్ధిపేట పర్యటన ప్రకటన వచ్చినప్పటి నుండి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ వర్గాల మద్య పరస్పరంగా వాడివేడి మాటల యుద్ధం కొనసాగుతున్నది. దానికి తగినట్లు సిద్ధిపేట నియోజకవర్గానికి గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న డిమాండ్‌తో రేవంత్‌రెడ్డికి హరీష్‌రావు రాసిన బహిరంగ లేఖాస్త్రం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. తమ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నెరవేర్చని హామీలకు సంబందించిన జాబితాను ఫ్లెక్సీల్లో ముద్రించిన నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి రాక సందర్భంగా అంతటా ప్రదర్శనకు పెట్టడంకూడా ఇప్పుడు రాజకీయ రగడగా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





