వరంగల్‌లో అమరుల కుటుంబాలతో డీజీపీ సీ వీ ఆనంద్ భేటీ
‘టీజీ-వీర్’ యాప్ ప్రారంభం
పోలీసు అమరుల త్యాగాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొన్నాయని తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్లతో పోరాడుతూ అమరులైన 28 మంది పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో ఆయన ఆత్మీయంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అమరుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘టీజీ-వీర్’ గ్రీవెన్స్ పోర్టల్‌ను డీజీపీ ప్రారంభించారు. ఎక్స్‌గ్రేషియా, ఆర్థిక సాయం, కారుణ్య నియామకాలు, స్థలాల కేటాయింపు, సంక్షేమ పథకాల వంటి అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను ఒకే వేదికపై నమోదు చేసుకునేలా ఈ పోర్టల్‌ను రూపొందించారు. అమరుల సేవా వివరాలు, కుటుంబ సమాచారం, ఇప్పటివరకు పొందిన ప్రయోజనాలు, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాష్ట్ర, యూనిట్ స్థాయిలో అధికారులు ఫిర్యాదుల పరిష్కారాన్ని పర్యవేక్షించే అవకాశం కల్పించారు.
అమరుల కుటుంబాలకు క్యూ ఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక ఫ్యామిలీ కార్డులను డీజీపీ అందజేశారు. ఆ క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే నేరుగా టీజీ-వీర్ పోర్టల్‌కు చేరుకునేలా ఏర్పాటు చేశారు. ఈ పోర్టల్‌ను రూపొందించిన ఎస్‌ఐబీ అధికారులను అభినందించిన ఆయన, రాష్ట్రంలోని అన్ని యూనిట్ల నుంచి అమరుల కుటుంబాల సమస్యలను సేకరించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
సమావేశంలో అమరుల కుటుంబాలు ఎక్స్‌గ్రేషియా, ఆర్థిక సాయం, స్థలాల కేటాయింపు, రిజిస్ట్రేషన్, పెన్షన్, ఇతర సంక్షేమ అంశాలకు సంబంధించిన ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకొచ్చాయి. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే వాటి పరిష్కారాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని వరంగల్ పోలీసు కమిషనర్‌కు సూచించారు.
తన ఉద్యోగ జీవితాన్ని వరంగల్‌లోనే ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్న డీజీపీ, నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉన్న రోజుల్లో పోలీసు సిబ్బంది ఎన్నో ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. అప్పటి త్యాగాల వల్లే నేడు ఈ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొన్నదని పేర్కొన్నారు.
అనంతరం డీజీపీ నిర్మాణంలో ఉన్న వరంగల్ పోలీసు కమిషనరేట్ నూతన కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. నిర్మాణ పురోగతిని కమిషనర్ వివరించారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందేలా, ఆధునిక సాంకేతికత, నిఘా వ్యవస్థలకు అనుకూలంగా భవనాన్ని తీర్చిదిద్దాలని డీజీపీ సూచించారు. వినియోగంలో లేని పాత భవనాలను తొలగించి, కార్యాలయానికి వెళ్లే అంతర్గత రహదారులను మెరుగుపరచాలని ఆదేశించారు.





