– సుప్రీంకోర్టులో స్టీఫెన్‌సన్ ఇంప్లీడ్ పిటిషన్
– బాధితుడిగా వాదనలు వినాలని కోర్టుకు విజ్ఞప్తి
– రేవంత్ రెడ్డి పిటిషన్‌పై వాడివేడిగా విచారణ
హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 2015 నాటి ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారు, నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అదనపు వాదనలు వినిపించేందుకు తనకు అవకాశం కల్పించాలని స్టీఫెన్‌సన్ కోరారు. ప్రధాన ఫిర్యాదుదారుగా తన వాదనలను వినడం నిష్పక్షపాత విచారణకు అత్యంత కీలకమని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఈ ఇంప్లీడ్ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. 2015 జూన్‌లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి (ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి) రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డి సహా ముగ్గురిని అరెస్టు చేయడంతోపాటు నగదును స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఆడియో, వీడియో రికార్డింగులను కీలక ఆధారాలుగా పేర్కొన్నారు. తనపై నమోదైన ఎఫఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న తరుణంలో స్టీఫెన్‌సన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా పరిణామాలతో తెలుగు రాష్ట్రాల రాజకీయ, న్యాయ వర్గాల్లో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




