ఒంటరి పోరుకు బీజేపీ నిర్ణయం !!

తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒంటరిగానే బరిలోకి దిగుతుందని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుండి నేటి వరకు బీజేపీ సొంతంగా బలపడటం కంటే మిత్రపక్షాలపైనే ఎక్కువగా ఆధారపడిందనేది కాదనలేని చారిత్రక సత్యం. ఈ నేపథ్యంలో, రామచందర్ రావు ప్రకటన కేవలం కార్యకర్తల్లో జోష్ నింపడానికేనా లేక క్షేత్రస్థాయిలో పార్టీ సాధించిన బలానికి నిదర్శనమా అనే కోణంలో విశ్లేషించాల్సిన అవసరం ఉంది.

ఉమ్మడి రాష్ట్రంలో గానీ, విభజన అనంతరం గానీ బీజేపీ సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ నీడలోనే సాగింది. ప్రత్యేకించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలకు అనుగుణంగానే గతంలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక జరిగాయనేది నిష్టుర స‌త్యం. పొత్తుల వల్ల బీజేపీ కొన్ని స్థానాలకే పరిమితమై, సొంత క్యాడర్‌ను విస్తరించుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో నేటికీ ఇదే ధోరణి కొనసాగుతుండగా, తెలంగాణలో మాత్రం 2014 తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 2014 విభజన తర్వాత తెలంగాణలో బీజేపీ తన వ్యూహాన్ని మార్చింది. ప్రస్తుతం జాతీయ నాయకత్వం నితిన్ నబిన్ నేతృత్వంలో తెలంగాణ పై ప్రత్యేక దృష్టి సారించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏకంగా 8 స్థానాలను గెలుచుకోవడం, వోట్ల శాతాన్ని భారీగా పెంచుకోవడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో ఒక ప్రధాన శక్తిగా అవతరించింది.

రాష్ట్రంలోని 938 మండలాల్లో దాదాపు 660 మండలాల్లో బీజేపీ బలమైన పునాదిని ఏర్పరచుకోవ‌డం, బీఆర్‌ఎస్ బలహీనపడటంతో, అధికార కాంగ్రెస్ పార్టీకి తామే ఏకైక ప్రత్యామ్నాయం అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావించ‌డం, ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపుతుండటంతో 119 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు అభ్యర్థుల కొరత లేదని భావించ‌డం, తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ ఒంటరి పోరుకు మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, తెలంగాణలో ఆ సమీకరణాలు వర్తించడం కష్టమే. తెలంగాణలో టీడీపీ క్యాడర్ దాదాపు ఖాలీ  అయింది, జనసేన ప్రభావం కొన్ని పట్టణ ప్రాంతాలకే పరిమితం.

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో మళ్లీ పొత్తులు పెట్టుకుంటే, ఎదుగుతున్న బీజేపీ గ్రాఫ్ పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే మిత్రపక్షాలను పక్కన పెట్టి, 119 స్థానాల్లో ఒంటరిగా సత్తా చాటాలని బీజేపీ నిర్ణ‌యించుకుంద‌నుకోవాలి. అదీకాకుండా అధిష్టానం అనుమ‌తి లేకుండా రామ‌చంద్ర‌రావు ఇటువంటి ప్ర‌క‌ట‌న చేసివుంటార‌నుకోవ‌డానికి వీల్లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ  కూటమి అధికారంలో ఉండటం, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కీలక మిత్రుడిగా మారిన నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరుపై ఆయన ప్రభావం ఉండే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్‌పై, పొత్తుల ద్వారా ఏపీ బీజేపీపై ఆయనకు పట్టు ఉందనేది వాస్తవమే అయినప్పటికీ, తెలంగాణ రాజకీయ వ్యూహాలు పూర్తిగా భిన్నమైన సమీకరణాలతో నడుస్తాయి.

చంద్రబాబు నాయుడి ప్రధాన ప్రాధాన్యత ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి , అక్కడ తన అధికారాన్ని కాపాడుకోవడంపైనే ఉంటుంది. కేంద్రం నుంచి ఏపీకి నిధులు, ప్యాకేజీలు సాధించడానికే ఆయన తన ప్రభావాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. తెలంగాణలో టీడీపీ ఉనికి చాలా వరకు తగ్గిపోయింది కాబట్టి, ఇక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఆయనకు వొచ్చే నష్టమేమీ లేదు. పైగా, తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగితే వ్యతిరేక వోట్లు చీలిపోయి, పరోక్షంగా ఆయన మిత్రుడు రేవంత్ రెడ్డి (కాంగ్రెస్)కి మేలు జరిగే అవకాశం కూడా ఉంది. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా వొస్తేనే కాంగ్రెస్‌కు అనుకూలమని రేవంత్ రెడ్డి కూడా భావించవొచ్చు. ఎందుకంటే బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిగా వొస్తే వోట్ల సమీకరణాలు మారిపోతాయి. అందువల్ల, చంద్రబాబు కూడా తెలంగాణ విషయంలో బీజేపీ స్వతంత్ర నిర్ణయాలకే మొగ్గు చూపేలా వ్యూహాత్మక మౌనం వహించవొచ్చు.

చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఎంత చక్రం తిప్పినా, తెలంగాణలో క్షేత్రస్థాయిలో ఎదగాలనే బీజేపీ జాతీయ ఆకాంక్షను ఆయన అడ్డుకోలేరు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులు సజావుగా సాగాలంటే, తెలంగాణలో బీజేపీకి నచ్చినట్లు ఒంటరిగా పోటీ చేసే స్వేచ్ఛను చంద్రబాబు ఇవ్వక త‌ప్ప‌దు! ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయవంతంగా నడుస్తున్నప్పటికీ, ఆ పొత్తును తెలంగాణకు వర్తింపజేయలేమని రెండు పార్టీల నాయకత్వాలు క్లియర్ చేసినయ్ . తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ, జనసేనతో పొత్తు కేవలం కేంద్ర స్థాయిలో మరియు ఏపీ వరకే పరిమితమని, తెలంగాణ స్థానిక, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేయ‌డంతో తెలంగాణలో మిత్రపక్షాల మధ్య ‘ఫ్రెండ్లీ కాంటెస్ట్’ లేదా విడివిడిగా పోటీ ఖాయ‌మైన‌ట్టే. ఏపీలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్ల లాభపడిన బీజేపీ, తెలంగాణలో ఆయన ఒంటరిగా పోటీ చేస్తే పట్టణ ప్రాంతాల్లోని సెటిలర్లు, యువత వోట్లను జనసేన చీల్చే ప్రమాదం ఉంది. ఇది బీజేపీ వోటు బ్యాంకుకు కొంత మేర‌ గండి కొట్టవొచ్చు. ఇదిలావుండ‌గా  బెంగాల్ విజ‌యం త‌ర్వాత ప్ర‌స్తుతం బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం తెలంగాణ‌పై దృష్టి పెట్టింద‌నేది సుస్ప‌ష్టం. కాబట్టి, రాబోయే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా ముందుకెళ్ల‌డం ఖాయం. ఈ పరిణామం తెలంగాణలో వోట్ల సమీకరణాలను మార్చి, సరికొత్త రాజకీయ రసవత్తర పోరుకు వేదిక కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *