-‘ ప్రజాతంత్ర’ కథనానికి సంచలన స్పందన
– విచారణకు జిల్లా ఎస్పీ ఆదేశం
– సీసీఎస్ పోలీసులకు విచారణ బాధ్యతలు అప్పగింత
– పత్రికా కార్యాలయానికి వెల్లువెత్తిన ఫోన్ కాల్స్
మహబూబ్ నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : ఇన్సూరెన్స్ కంపెనీల పేరిట రాత్రికి రాత్రే బోర్డులు తిప్పేస్తూ ఐఆర్డీఏఐ (ఐఆర్డీఏఐ) నిబంధనలకు విరుద్ధంగా అమాయకుల నుంచి కోట్లు వసూలు చేస్తున్న దందాపై ‘ప్రజాతంత్ర’ సంచికలో గురువారం వెలువడిన కథనం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కథనానికి స్పందించిన పలువురు బాధితులు గురువారం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ)ని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని విన్నవించుకున్నారు. బాధితుల ఫిర్యాదుపై వెంటనే స్పందించిన ఎస్పీ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ‘ప్రజాతంత్ర’లో ప్రచురితమైన వార్తను చూసి జిల్లా నలుమూలల నుంచి దాదాపు 30 మందికి పైగా బాధితులు ప్రజాతంత్ర పత్రికా ప్రతినిధులను ఫోన్ ద్వారా సంప్రదించారు. ఉచిత గిఫ్ట్ టోకెన్ల పేరుతో మమ్మల్ని నమ్మించి మా కష్టార్జితాన్ని లాక్కున్నారు.. మా డబ్బులు మాకు తిరిగి వచ్చేలా చేయండి’ అని పాత బస్టాండ్, నవాబ్ పేట, ఎర్రసత్యం చౌరస్తా నారాయణ పేట శాశబ్ గుట్ట ప్రాంతాలకు రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు కంటతడి పెట్టారు. కొందరు బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఆ ముఠా నడుపుతున్న ఆఫీస్ అడ్రస్ చెప్పండి.. మేమే నేరుగా వెళ్లి వారి సంగతి తేల్చుకుంటాం’ అని విజ్ఞప్తి చేశారు. ఈ మోసపూరిత నెట్‌వర్క్ బాధితులుగా మారిన వారు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సీసీఎస్ రెస్పాన్స్ టీమ్‌ను నేరుగా కలవవచ్చు. మీరు చెల్లించిన రశీదులు, ఉచిత కూపన్ల టోకెన్లు,బాండ్లు లేదా ఫోన్ కాల్ రికార్డింగ్‌లు ఉంటే విచారణాధికారులకు అందించాలి. నిబంధనలకు విరుద్ధంగా బోర్డులు లేకుండా, అర్హత లేని ఏజెంట్లతో దందాలు నడిపే కేంద్రాలపై సైబర్ క్రైమ్, విజిలెన్స్ అధికారులు కఠిన చర్యలు తీసుకునే వరకు ‘ప్రజాతంత్ర’ ఈ అంశంపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




