– 200 నుంచి 250 కంపెనీలను ఆహ్వానించేందుకు విస్తృత కసరత్తు
– ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రి ఉత్తమ్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 10 : సూర్యాపేట జిల్లాతోపాటు ఉమ్మడి నల్లగొండ, పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈనెల 19వ తేదీన కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ మేళాకు 200 నుంచి 250 కంపెనీలను ఆహ్వానించి వేలాదిమంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళా ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో గురువారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్.పి. నరసింహ, సంబంధిత శాఖల అధికారులు, కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు మంత్రిగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు నేను నిరంతరం ప్రయత్నిస్తున్నాను.. ఉపాధి అవకాశాలను అందించి వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే ఈ మెగా జాబ్ మేళా ప్రధాన లక్ష్యం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అపూర్వ స్పందన లభించిందని గుర్తు చేశారు. ఆ మేళాలో సుమారు 200 కంపెనీలు పాల్గొనగా దాదాపు 40 వేల మంది నిరుద్యోగ యువత పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. వారిలో దాదాపు 20 వేల మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని, సుమారు మూడు వేల మంది ఉద్యోగాలు పొందడం లేదా తదుపరి దశ ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని వివరించారు. అంతకంటే భారీ స్థాయిలో కోదాడలో ఉపాధి మేళాను నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని నిరుద్యోగ యువతను విస్తృతంగా సమీకరించాలని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకునేలా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలలు, ఐటీఐలకు ప్రత్యేక బృందాలను పంపి ముఖ్యంగా చివరి సంవత్సరం విద్యార్థులను జాబ్ మేళాకు ఆహ్వానించాలని మంత్రి ఆదేశించారు. సోషల్ మీడియా, స్థానిక ప్రసార సాధనాలు, ఇతర సమాచార వేదికల ద్వారా జాబ్ మేళా వివరాలు ప్రతీ అర్హుడైన నిరుద్యోగ యువతకు చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. 200 నుంచి 250 కంపెనీలను రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోదాడలోని సి.సి.రెడ్డి కాన్వెంట్‌ను మెగా జాబ్ మేళా వేదికగా ఖరారు చేసినట్లు వెల్లడించారు. అదనంగా మైదానం, పరిసర ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అభ్యర్థుల నమోదు, ఇంటర్వ్యూల నిర్వహణ, వాహనాల పార్కింగ్, భోజనం, తాగునీరు తదితర సౌకర్యాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంతమంది హాజరైనా ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయం కల్పించాలని స్పష్టం చేశారు. జాబ్ మేళాకు వచ్చిన ప్రతి అభ్యర్థికీ ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం కల్పించాలని మంత్రి సూచించారు. జాబ్ మేళాను ప్రభుత్వ కార్యక్రమంగా, నిర్దేశిత ప్రొటోకాల్ ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





