కోచ్‌పై పోక్సో కేసు నమోదు

– టోర్నమెంట్లో బాలికతో అసభ్య ప్రవర్తన ఆరోపణలు
– పరారీలో నిందితుడు
శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఆగస్టు 4 : టోర్నమెంట్‌ల సందర్భంగా ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యకరమైన సైగలు చేయడంతోపాటు లైంగికప‌ర‌మైన‌ వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై బాస్కెట్‌బాల్ కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డిపై మాదాపూర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల నిర్వహించిన బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ సందర్భంగా కోచ్ పృథ్వీశ్వర్ రెడ్డి పలుమార్లు బాలికను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన సైగలు చేయడంతోపాటు లైంగిక వేధింపులకు గురిచేసే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కోచ్ ప్రవర్తనతో తీవ్ర మానసిక వేద‌న‌కు గురైన బాలిక‌ తన కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు గత నెల 24న ఆర్సీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నందున అదే రోజు కేసును మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఫిర్యాదు, అందుబాటులో ఉన్న వివరాలు, ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన అనంతరం మాదాపూర్ పోలీసులు పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్లతోపాటు ఇతర వర్తించే నిబంధనల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి టోర్నమెంట్‌లో పాల్గొన్న క్రీడాకారులు, నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేస్తున్నారు. అవసరమైన సాక్ష్యాధారాలను సేకరిస్తూ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు, నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *