డాక్టర్ వకుళాభరణంకు ప్రధాని మోదీ అభినందన

– బీసీల కోసం చేసిన కృషి గొప్పదంటూ  ప్రశంస

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 11 : తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, రచయిత డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు తన సతీమణి సుధాశ్రీతో కలిసి పార్లమెంట్ భవనంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మంగళవారం కలిశారు. సుమారు పది నిమిషాలపాటు సాగిన భేటీలో తాను రచించిన ‘శ్రీ నరేంద్ర మోదీ- భారత్‌ను విశ్వవేదికపై నిలిపిన మహానాయకుడు’ తెలుగు,హిందీ, ఇంగ్లీష్ త్రిభాషా గ్రంథం, ‘అంత్యోదయం నుంచి వికసిత భారత్’ తెలుగు గ్రంథం, ‘జీఎస్టీ- సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం- వికాస యాత్ర’ త్రిభాషా గ్రంథాలను ప్రధానమంత్రికి సమర్పించారు. గ్రంథాలను ఆసక్తిగా పరిశీలించిన ప్రధాని ఈ గ్రంథాల రచనలో మీరు యజ్ఞం చేశారు అంటూ డాక్టర్ వకుళాభరణంను అభినందించారు. ఆయన వ్యక్తిగత వివరాలు, విద్యార్థి దశ నుంచి బీసీ ఉద్యమాల్లో సాగించిన ప్రయాణం, బీసీ కమిషన్లలో సభ్యుడిగా, ఛైర్మన్‌గా అందించిన సేవలను అడిగి తెలుసుకున్నారు. బీసీల కోసం మీరు చేసిన కృషి గొప్పది అని ప్రశంసించారు. అత్యంత చిన్న సామాజికవర్గం నుండి ప్రజాజీవితంలో డాక్టర్ వకుళాభరణం ఎదిగిన తీరును ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ‘మీ నిబద్ధతను పరిశీలించాను.. కలిసి పనిచేద్దాం’ అని పేర్కొంటూ రచనా పరంపరను కొనసాగించాలని సూచించినట్లు డాక్టర్ వకుళాభరణం ఒక ప్రకటనలో తెలిపారు. ‘జీఎస్టీ- సామాజిక న్యాయం, ఆర్థిక సమానత్వం, వికాస యాత్ర’ గ్రంథాన్ని 2025 డిసెంబర్ 16న పార్లమెంట్ భవనంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆవిష్కరించగా మిగిలిన రెండు గ్రంథాలను 2026 జూన్ 28న హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ అరుదైన అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, సహకరించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి డాక్టర్ వకుళాభరణం కృతజ్ఞతలు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *