– ‘చేయూత’ అర్హత ప్రమాణాల్లో మార్పు లేదు
– గతంలోని మార్గదర్శకాల ప్రకారమే కొత్త పింఛన్లు
– 31వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11 : అర్హులైన పేదలు, బలహీనవర్గాలకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా చేయూత సామాజిక భద్రత పింఛన్ పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, తలసీమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. కొత్త పింఛన్ల కోసం అర్హత ప్రమాణాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. 2014 నుంచి 2018 మధ్య గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న అర్హతా ప్రమాణాలనే ఈ ప్రభుత్వం కూడా ప్రామాణికంగా తీసుకుంటోంది. ప్రజా పాలన వారోత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు, ప్రజావాణిలో ఇప్పటికే అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో దరఖాస్తు చేసి అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయనక్కరలేదు. అవసరమైన పత్రాలు సమర్పించని వారు లేదా ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత నిర్ధారణ కోసం సంబంధిత శాఖల నుంచి అవసరమైన ధ్రువపత్రాలు పొందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు. వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం, ఒంటరి మహిళలకు సెపరేషన్ లేదా స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ, చేనేత కార్మికులకు చేనేత-జౌళి శాఖ ధ్రువీకరణ, ఫైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరణ అవసరం. దరఖాస్తుల పరిశీలన అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతను తనిఖీ చేస్తారు. తర్వాత అర్హుల జాబితాను జిల్లాస్థాయికి పంపి జిల్లా కలెక్టర్ ఆమోదంతో పింఛన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేస్తారు. ప్రతీ అర్హుడికి చేయూత అందించాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు కూడా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా ప్రతీ అర్హత కలిగిన వితంతువు, ఒంటరి మహిళకు దరఖాస్తు చేసుకోవడం, అవసరమైన ధ్రువపత్రాలు పొందడంలో సహకరించాలని సూచించారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఈనెల 31 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తులతోపాటు వివరాలను చేయూత పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను కూడా వెంటనే చేపట్టనున్నారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు