– క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి
– మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి నివాళులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : భారతీయ క్రీడా స్ఫూర్తిని ప్రపంచ పటంలో సమున్నత స్థాయిలో నిలిపిన మహానుభావుడు ధ్యాన్‌చంద్ అని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కొనియాడారు. ఆయన చూపిన క్రమశిక్షణ, ఏకాగ్రత ప్రతి క్రీడాకారుడికీ మార్గదర్శకమన్నారు. భారత హాకీ దిగ్గజం, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీహరి, క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, క్రీడా శాఖ వీసీ & ఎండీ డాక్టర్ ఎ.సోనిబాలదేవి, హాకీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండా విజయ్‌లు హాజరయ్యారు. ప్రస్తుత యువత తమ సమయాన్ని సోషల్ మీడియా రీల్స్‌పై వృథా చేయకుండా భవిష్యత్తు కోసం క్రీడలవైపు దృష్టి సారించాలని మంత్రి ఉద్బోధించారు. రీల్స్ కోసం కాకుండా రియల్ లైఫ్ కోసం ఆటలు ఆడండి అని సూచించారు. తొలుత స్టేడియం ప్రాంగణంలోని మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ హాకీ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ను మంత్రి, చైర్మన్ ప్రారంభించారు.
క్రీడా హబ్‌గా తెలంగాణ
రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి ‘స్పోర్ట్స్ హబ్’గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, అధునాతన మౌలిక వసతులు, తగిన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత గాయత్రి గోపీచంద్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి త్రీసా జాలీ, ఆసియా అథ్లెట్ నందిని అగాసరాతోపాటు క్రీడా శాఖ అధికారులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





