– వికారాబాద్, తాండూర్ రైల్వే స్టేషన్ల పనుల పరిశీలన
– రూపుదిద్దుకుంటున్న మన్నెగూడ-బీజాపూర్ హైవే
– ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చేవెళ్ల, వికారాబాద్, తాండూర్ ప్రాంతాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదివారం విస్తృతంగా పర్యటించనున్నట్లు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నియోజకవర్గంలో జరుగుతున్న పలు కీలక అభివృద్ధి పనులను ఆయనతో కలిసి తాను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లు శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, రోడ్ల నిర్మాణాల్లో 90 శాతానికి పైగా అభివృద్ధి పనులు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమవుతున్నాయని స్పష్టం చేశారు. నేషనల్ హైవేలతోపాటు సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆరఐఎఫ్), ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్), ఉపాధి హామీ పథకం (ఎంజీనరేగా), ఎంపీ ల్యాడ్స్ నిధుల ద్వారానే పల్లెలు, పట్టణాల్లో రోడ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. తాను తొలిసారి ఎంపీగా ఉన్నప్పుడు మంజూరు చేయించిన చేవెళ్ల-వికారాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి పనులు గతంలో నిలిచిపోయినప్పటికీ ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయని, ఆరు నెలల్లో పూర్తి కానుందని తెలిపారు. వికారాబాద్, తాండూర్ రైల్వే స్టేషన్లలో అత్యాధునిక ఎయిర్‌పోర్ట్ తరహా ప్రమాణాలతో(అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద) జరుగుతున్న పునర్నిర్మాణ పనులను కిషన్ రెడ్డి పరిశీలిస్తారని ఎంపీ తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి ‘మన్ కీ బాత’లో పాల్గొంటారని, సీఎస్సార్ నిధులతో స్థానిక స్వచ్ఛంద సంస్థ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటారని తెలిపారు. వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్ పర్యటనకు వెళ్తారని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులందరం పూర్తి సమన్వయంతో కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ అంశాలు, రైతుల సంక్షోభంపై ప్రత్యేక దృష్టి సారించామని, రానున్న రోజుల్లో విద్యార్థులు, రైతాంగ సమస్యలపై చేపట్టాల్సిన ప్రజా పోరాటాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





