నాణ్యమైన విద్యకు ప్రజా ఉద్యమమే పునాది

– ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఐసీయూలో ఉంది
– ప్రజలే వైద్యులై చికిత్స చేసి బతికించుకోవాలి
– తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ మురళి

ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : ప్రజలకు నాణ్యమైన విద్య లభించాలంటే రాజకీయ వ్యవస్థపై ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ప్రజల నుంచి డిమాండ్ లేకుండా ఏ పాలకవర్గం విద్యావ్యవస్థను సరిదిద్దుతుందని భావించలేమని, ఆశించడం కూడా పొరపాటేనని అన్నారు. ఖమ్మం మయూరి సెంటర్లోని ఓ హోటల్ లో విద్యాభిమానులు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలతో బుధవారంజరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఐసీయూలో ఉందని, ప్రజలే డాక్టర్లుగా మారి దానికి చికిత్స చేసి బతికించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రులు అధిక ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నార‌ని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు నియంత్రణకు చట్టం చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని సౌకర్యాలు గల తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా మార్చితే ప్రైవేటు బడులకు పిల్లలను పంపాల్సిన అవ‌స‌రం ఏముంటుందని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 37శాతం మంది పిల్లలే చదువుతున్నారన్నారు. ఇలాగే అసౌకర్యంగా కొనసాగితే ప్రభుత్వ బడి మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు.
సమావేశంలో బస్సు యాత్ర లో పాల్గొన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ కోర్ కమిటీ సభ్యులు ప్రొఫెసర్ పద్మజా షా, ఎం.చంపాలాల్, పి.అశోక్ కుమార్, సృజన యాదవ్, పోరన్న, ఎం.నర్సింహరావు, హరీష్, రుబీనా, నిఖిల్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి సీనియర్ జర్నలిస్టు, ఎడ్యుకేషన్ ఎనలిస్టు ఎన్.తిర్మల్ మోడరేటర్ గా వ్యవహరించారు. సమావేశంలో డాక్టర్ యం.యఫ్ గోపినాథ్, భద్రూనాయక్, పిఆర్టీ యు జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్, టిపిటీ యఫ్ జిల్లా అధ్యక్షుడు జి.మల్లయ్య, యుటీయఫ్ ప్రతినిధి ఉద్దండు, ధర్మసమాజ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుంక రశ్రీనివాస్, పిడియస్యు జిల్లా కార్యదర్శి మ స్తాన్, బలహీనవర్గాల జాక్ కన్వినర్ పి. రాంబాబు, కనకయ్య, రిటైర్ ఉపాద్యాయ సంఘం జిల్లా కార్యదర్శి టి.వేణు, నాగిరెడ్డి, ప్రజానాట్యమండలి దేవేందర్, బొబ్బిలి భారత్ చంద్ర, మణిభూషణాచారి, ఖలీల్, ఝూన్సీ, సునీత, సృజన, విజయకుమార్ గుంతేటి వీరభద్రం తదితర 30 మంది విద్యారంగం ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రౌండుటేబుల్ సమావేశం ప్రభుత్వ బడులను సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి మండలానికి నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని, ప్రైవేటు పాఠశాల ఫీజులు నియంత్రణ చేయాలని, చట్టబద్ధంగా విద్యకు బడ్జెట్ లో ఏటా 18శాతం నిధులు కేటా యించాలని తీర్మానం చేసింది. ఈ మూడు అంశాలపై జరిగే ఉద్యమానికి సైతం సమావేశం సంపూర్ణ మద్దతు ప్రకటించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *