బీఆర్ఎస్ భూములపై బీజేపీ దండయాత్ర

– ఆ భూముల్లో కాషాయ జెండాలు ఎగరేసి పేదలకు పంచుతాం
– ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే భూముల చిట్టా విప్పారు
– కేసీఆర్ ఫాంహౌజ్‌లో సర్కార్ భూమి ఉందని తేల్చడానికి 33 నెలలు పట్టిందా?
– విచారణ పేరుతో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ చీకటి ఒప్పందం ఖాయం
– కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : బీఆర్ఎస్ దోచుకున్న భూములపై బీజేపీ ఆధ్వర్యంలో దండ యాత్ర చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భూముల్లో కాషాయ జెండా ఎగరేసి పేదలకు పంచి పెడతామని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ భూ దోపిడీని సీఎం ప్రస్తావించడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకే అసెంబ్లీలో ప్రస్తావించి ఆ పార్టీతో బేరసారాలకు సిద్ధమయ్యారని చెప్పారు. భూముల విచారణ పేరుతో బీఆరఎస్‌తో చీకటి ఒప్పందం ఖాయం.. యూపీ ఎన్నికల కోసం అవసరమైన డబ్బులను బీఆర్ఎస్ సర్దడం తథ్యం అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, నగర మేయర్, డిప్యూటీ మేయర్‌లతో కలిసి సంజయ్ మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లో బుధవారం పర్యటించి గణేశ్ నిమిజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ఉత్సాహంగా నిమజ్జనోత్సవాలు జరుపుకునేలా ఏర్పాట్లను చేయాలని అధికారులను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాల కోసం రూ.1.5 కోట్లను కేటాయించామని, గతేడాదితో పోలిస్తే మూడింతలు ఎక్కువ అని చెప్పారు. నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా మÖడు రోజుల ముందే నీళ్లను విడుదల చేయాలన్నారు. ప్రజల సెంటిమెంట్‌తో ఆటలాడితే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌కు చెందిన ఎనిమిదిమంది ఎమ్మెల్యేల భూబాగోతం గురించి మాట్లాడటానికి గంట సమయం పట్టింది. మరి 90 మంది ఎమ్మెల్యేల భూబాగోతం గురించి మాట్లాడాలంటే ఎన్ని రోజులు అసెంబ్లీ నిర్వహించాలి అని ప్రశ్నించారు. రాష్ట్రం.లో 60 శాతం మంది ప్రజలకు భూముల్లేవు. 25 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టుకోవడాని గజం జాగా కూడా లేదన్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేల ఎకరాలను దోచుకున్నారు అని ఆరోపించారు. పాదయాత్రలో నేను భూ దోపిడీ గురించి మాట్లాడితే కేసీఆర్ తన తలను ఆరు ముక్కలు చేస్తానన్నారు.. అయినా కేసీఆర్ మెడలు వంచి ఫాంహౌజ్ నుండి గుంజుకొచ్చి ప్రజల ముందుంచిన అని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని చెప్పడానికి వెయ్యి రోజులు పట్టిందా సీఎంగారూ.. బీఆర్ఎస్ నేతలతో డీల్ కుదరలేదా.. ఏఐసీసీకి కట్టాల్సిన ఈఎంఐ గడువు ముంచుకొస్తుండటంతో ఒత్తిడి పెరిగిందా.. అసెంబ్లీ వేదికగా వివరాలు బయటపెట్టి వారికి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారా అని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా ‘సిట్‌’ పేరుతో మీరు నియమించిన విచారణ కమిటీలు ఏమయ్యాయి అని అడిగారు. బేరాలు కుదరగానే సిట్‌ను నీరుగార్చడం సీఎంకు అలవాటే కదా అని ఎద్దేవా చేశారు. సీఎం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ లా కమిటీలు మారాయన్నారు. ఈ భూములపై కూడా విచారణ పేరుతో ఇంకెన్నాళ్లు లాగుతారు అని అడిగారు. కలెక్టర్లకు పూర్తి అధికారాలిస్తే 24 గంటల్లో పూర్తి నివేదిక ఇస్తారు.. కానీ 30 రోజుల గడువు పేరుతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్నారా అని రేవంత్‌ను ఆయన ప్రశ్నించారు.  రూ.లక్షల కోట్ల విలువైన కేసీఆర్ ఫాంహౌస్‌లోని భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదన్నారు. విద్యుత్ కొనుగోళ్లు, ఈ ఫార్ములా రేసు, కాళేశ్వరం, గొర్రెల స్కాంసహా కేసులన్నీ ఏమయ్యాయి అని అడిగారు. పేదలు అటవీ భూముల్లో సాగు చేస్తే నానా ఇబ్బందులు పెడతారు కదా.. వందల ఎకరాల అటవీ భూమిని కబ్జా చేస్తే చర్యలేవి అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆరఎస్‌లు దొందూ దొందే.. సీఎం మాట చెబితే అది శాసనం కావాలి. కానీ బీఆర్ఎస్‌తో బేరసారాల కోసం భూ దోపిడీని వాడుకోవడం సిగ్గు చేటు.. ప్రజలు ఛీకొడుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల చీకటి ఒప్పందాలపై జనం తిరగబడే రోజులు రాబోతున్నాయి అని హెచ్చరించారు. కాగా, తెలంగాణను అభివృద్ధి చేయాలని మోదీ తాపత్రయ పడుతున్నారని, అందులో భాగంగా బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేస్తే వాటికి కేటాయించిన భూములను సైతం  బీఆర్ఎస్ వాళ్లు చేశారని మంత్రి సంజయ్ ఆరోపించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *