ఉస్మానియా వొక స్వేచ్ఛా పావురం

అణిచివేత అంతర్జాతీయ భాషే –
కాని
మట్టి భాష నేర్చిన
విశ్వవిద్యాలయం
భావ సంఘర్షణల పంచభూతాల సమ్మేళనం

ఈ నేల దిక్సూచి
తెలంగాణ గుండె చప్పుడు

ఎన్ని ఆంక్షల సంకెళ్ళు తెంచుకోలేదు
ఎన్ని అణిచి వేతల కొండల దాటి రాలేదు

ప్రపంచం చెమ్మగిల్లిన ఆచరణ
దేశం అందుకున్న నినాదాల కూడలి
ఉద్యమాలకు పురుడు పోసి
స్వేచ్ఛకు చెప్పులు తొడిగిన తల్లి

శత వసంత వలయాల మీద
రాలిన గులాభి ఇనుప ముద్ర
ఏడో హామా!

ఉస్మానియా అంటే ధర్నాచౌక్‌ ‌కాదు
విత్తులు నానేసిన నిప్పుల మండే!
ప్రగతి భవన ఇనప పంజరం
తెంపు కొచ్చింది
ఉస్మానియా గొంతు కోసమని తెలియదు!

కళ్లకు గంతలు కట్టుకొని చదవకు
మాటల నియంత
నీ సహచరిత్రే కదా!

జార్జిరెడ్డి జంపాల వీరారెడ్డి అశోకు
మట్టంటిన పాదాక్షరాలకు
శిరసేత్తడం నేర్పారు

ఆర్టస్ ‌కాలేజి నుండి
ఇంజనీరింగ్‌ ‌కాలేజీ ఆవలి దాక
మంటలు మాట్లాడుకోవడం
వాళ్ళ అడుగుల గొంతుల్లో ఇప్పటికీ
వినగలిగే చెవులకు వినిపిస్తాయి

బతుకును సానపట్టే
ఆకురాయి!

నిప్పుల గొంతు
పిడుగుల పిడికిలి
మంటల దేహం
ఉస్మానియా యూనివర్సిటీ
విద్యార్థి విద్యుత్కేంద్రం!
  – వడ్డెబోయిన శ్రీనివాస్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *