సేంద్రియ వ్యవసాయమే మేలు

– వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ గోపి సూచన

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : రాబోయే ఏడెనిమిది నెలల్లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండే సూచనలున్నందున రైతులు ఈ యాసంగిలో వరి సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ సంచాలకుడు డాక్టర్ బి.గోపి కోరారు. తక్కువ నీటితో, తక్కువ కాలంలో చేతికొచ్చే ఆరుతడి పంటలను మాత్రమే ఎంచుకోవాలని, పప్పుజాతి, నూనెగింజల పంటలను సాగు చేయాలని సూచించారు. ఖేత్ బచావో అభియాన్-సాగు భూమి సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దుబ్బచెర్లలో ఆయన సోమవారం పర్యటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రైతులతో మాట్లాడారు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయని, భూగర్భ జలాలు అడుగంటాయని, అందువల్ల కూరగాయలు, పండ్ల తోటల సాగుపై దృష్టి పెట్టాలని, అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని డాక్టర్ గోపి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పశుగ్రాసం కొరత రాకుండా స్వల్పకాలిక పశుగ్రాస పంటలు సాగు చేయాలని కోరారు. సమగ్ర సస్యరక్షణ, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటిస్తూ శాస్త్రవేత్తల సిఫారసు మేరకే ఎరువులు, పురుగుమందులు వాడాలని సూచించారు. ప్రతీ రైతు కనీసం ఒక ఎకరంలో రసాయన రహిత ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, పండ్లకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉందని తెలిపారు. సమావేశం అనంతరం డాక్టర్ గోపి రైతు సీతారాములు క్షేత్రాన్ని సందర్శించారు. సొంతంగా పదెకరాలు, కౌలుకు తీసుకున్న 15 ఎకరాలు కలిపి 25 ఎకరాల్లో ఆయన ఈత, ఆయిల్ పామ్, వరి, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. సాగు విధానాలు, ఎదురవుతున్న సమస్యల గురించి రైతుతో ఆయన ముచ్చటించారు.

విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ప్రతిజ్ఞ

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి నవంబర్ 1 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ వారోత్సవాల ఉద్దేశం అవినీతి నిర్మూలన, పారదర్శకత, నైతిక విలువలను పెంపొందించడం. ఇందులో భాగంగా సంచాలకుడు, అధికారులు, రైతులతో కలిసి సమగ్రత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సుజాత, కృషి విజ్ఞాన కేంద్రం సంచాలకుడు డాక్టర్ చంద్రకాంత్, ఉద్యాన విషయ నిపుణులు శ్రీకృష్ణ, పశు వైద్య విషయ నిపుణుడు డాక్టర్ సుధీర్, జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక అధికారి డాక్టర్ దిలీప్, మహేశ్వరం సహాయ వ్యవసాయ సంచాలకుడు, మండల వ్యవసాయ అధికారి, సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *