దృఢ సంకల్పంతో మహర్షులుగా ఎదగవచ్చు

– వాల్మీకి జయంతి కార్యక్రమంలో రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : పరివర్తనతో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించవచ్చనడానికి మహర్షి వాల్మీకి జీవితమే నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తొలినాళ్ల జీవితంలో దోపిడీదారుడిగా ముద్రపడిన వ్యక్తి అంతర్మథనంతో గొప్ప పరివర్తన చెంది పవిత్ర రామాయణ మహా కావ్యాన్ని రచించి లవకుశులకు గురువై ఆది కవిగా చిరస్మరణీయుడయ్యారని గుర్తు చేశారు. సమాజంలో ఏ స్థాయిలో ఉన్నా దృఢ సంకల్పం, మార్పు, కఠోర కృషితో అట్టడుగువర్గాల వారు సైతం మహర్షులుగా ఎదగవచ్చనే స్ఫూర్తిని వాల్మీకి జీవన చరిత్ర చాటి చెబుతోందన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు వాల్మీకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జయంతి వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన రచించిన రామాయణం నేడు ప్రతి ఇంటిలో భాగమై జాతి గుండెల్లో నిలిచిందన్నారు. శ్రీరాముడు దేశమంతటికీ ఆరాధ్యుడని, కేవలం ఉత్తర భారతానికే పరిమితమని, దక్షిణ భారతంలో లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆయన అవివేకానికి నిదర్శనమని అన్నారు. వాల్మీకి సేవలను స్మరిస్తూ అయోధ్యలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పేరే పెట్టారని గుర్తు చేశారు. కేంద్రం సూచించిన విధంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ వాల్మీకి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతికిరణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు రాబోయే వారం రోజులపాటు ప్రతి ఎస్సీ బస్తీలోనూ వాల్మీకి జయంతి వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వాల్మీకి మహర్షి బోధనలు, హైందవ సంస్కృతి విశిష్టత, ఆదర్శ పురుషుడైన శ్రీరామచంద్రుని సద్గుణాలను సమాజంలోని ప్రతి ఒక్కరికీ చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, కొప్పు బాషా, వాల్మీకి సమాజం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ సింగ్, ఇతర ముఖ్య నాయకులు, ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *