న‌గ‌రంలో రేప‌టినుంచి సారస్ మేలా

– పది రోజులపాటు పల్లె ఉత్పత్తుల పండుగ
– 20 రాష్ట్రాల నుంచి 200 పైగా స్టాళ్లు
– 11న బతుకమ్మ వేడుకలు, హాజరు కానున్న మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6 : నగర వాసులకు గ్రామీణ భారతీయ కళలు, చేనేతలు, సంప్రదాయ రుచులు, మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను ఒకే వేదికపై ఆస్వాదించే అవకాశం రానుంది. ఈనెల 7 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచఎండీఏ గ్రౌండ్స్‌లో సారస్ మేలా జరగనుంది. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ ఈ మేళాను నిర్వహిస్తోంది. 20 రాష్ట్రాలకు చెందిన గ్రామీణ మహిళలు, కళాకారులు, స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయ వేదికగా సారస్ నిలవనుంది. ఈసారి 200కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తెలంగాణకు చెందినవే 95 కాగా, ఇతర రాష్ట్రాలకు చెందినవి 100కు పైగా ఉన్నాయి. ఇవేకాక వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో 43 స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి.

ఒకేచోట తెలంగాణ చేనేతల అందం.. దేశీ రుచుల వైవిధ్యం

మేళాలో అడుగుపెడితే తెలంగాణ పల్లెల సృజనాత్మకత నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల ప్రత్యేకతల వరకు ఒకే ప్రాంగణంలో కనిపించనున్నాయి. ఒక వైపు పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చేనేతల అందం.. మరోవైపు గ్రామీణ మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న హస్తకళలు.. ఇంకోవైపు పచ్చళ్లు, పిండి వంటలు, మిల్లెట్ ఉత్పత్తులు, సంప్రదాయ ఆహార పదార్థాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. రాష్ట్రం నుంచి 32 హస్తకళల స్టాళ్లు, 20 చేనేత స్టాళ్లు, 30 ఆహార ఉత్పత్తుల స్టాళ్లు, 4 హెర్బల్ ఉత్పత్తుల స్టాళ్లు, 3 ప్రొడక్షన్ ఐటమ్స్, 6 లైవ్ ఫుడ్ స్టాళ్లు కలిపి మొత్తం 95 స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. చెక్క బొమ్మలు, జూట్ బ్యాగులు, లెదర్ బ్యాగులు, మట్టి వస్తువులు, బంజారా కళాకృతులు, ఎంబ్రాయిడరీ, వివిధ ఆర్ట్ వర్క్స్‌తోపాటు పచ్చళ్లు, పొడులు, పిండి వంటలు, మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

22 రాష్ట్రాల గ్రామీణ ప్రతిభ

రాష్ట్రంతోపాటు దేశంలోని 21 ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి గ్రామీణ కళాకారులు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులతో పాల్గొంటున్నాయి. ఏపీ నుంచి 15 స్టాళ్లు, అండమాన్ నికోబార్ నుంచి 1, అసోం 1, బీహార్ 3, ఛత్తీస్‌గఢ్ 3, గోవా 2, గుజరాత్ 4, హిమాచల్‌ప్రదేశ్ 1, జమ్మూకశ్మీర్ 1, కర్ణాటక 5, కేరళ 7, మధ్యప్రదేశ్ 1, మహారాష్ట్ర 6, మణిపూర్ 2, ఒడిశా 5, రాజస్థాన్ 7, సిక్కిం 1, తమిళనాడు 6, త్రిపుర 2, ఉత్తరప్రదేశ్ 2, ఉత్తరాఖండ్ 1, పశ్చిమబెంగాల్ 5 స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. ఏర్పాటు చేస్తున్నారు. ఇక తెలంగాణతో పాటు ఇతర సంస్థల ఉత్పత్తులకు కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. ఏఎలఈఏపీ ఆధ్వర్యంలో 4, మెప్మా 15, నాబార్డ్ 10, టీజీ హెచ్‌డీసీ (గోల్కొండ) 2, టీజీఎస్‌సీఓ 1, ట్రైఫెడ్ 2, విజయ డెయిరీ 1, వీ హబ్ 8 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.

పల్లె ఉత్పత్తికి పట్టణ మార్కెట్

సారస్ మేళా గ్రామీణ మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పట్టణ వినియోగదారుల ముందుకు తీసుకెళ్లే మార్కెట్ అనుసంధాన వేదిక. తమ ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నదో మహిళా పారిశ్రామికవేత్తలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. ఏ ఉత్పత్తికి ఎక్కువ ఆదరణ ఉంది.. ఏ ప్యాకేజింగ్ ఆకట్టుకుంటోంది.. ధర విషయంలో వినియోగదారుల అభిప్రాయం ఏమిటి.. ఏ ఉత్పత్తులను మరింత మెరుగుపరచాలి వంటి అంశాలపై ప్రత్యక్ష మార్కెట్ అనుభవం పొందే అవకాశం మహిళా సంఘాలకు లభిస్తుంది. ఇలాంటి మేళాల ద్వారా ఒక గ్రామంలో తయారైన ఉత్పత్తి హైదరాబాద్ వంటి పెద్ద నగర మార్కెట్‌లోకి అడుగుపెడుతుంది. అక్కడినుంచి మరిన్ని మార్కెట్ లింకేజీలు, బల్క్ ఆర్డర్లు, సంస్థాగత కొనుగోళ్లకు అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మేళా లక్ష్యాల్లో పట్టణ వినియోగదారుల్లో అవగాహన పెంచడం, మార్కెట్ అవకాశాలు కల్పించడం, ఉత్పత్తిదారులకు బల్క్ ఆర్డర్లు, వ్యాపార అనుసంధానాలకు అవకాశాలు కల్పించడం కూడా ఉన్నాయి.

గ్రామీణ మహిళల వ్యాపార ప్రయాణంలో కీలకమైన మార్పు

ఒకప్పుడు గ్రామంలో తయారైన వస్తువు గ్రామ పరిధిలోనే అమ్ముడయ్యే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అదే ఉత్పత్తి హైదరాబాద్ వంటి మహా నగరంలో వేలాదిమంది వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇది గ్రామీణ మహిళల వ్యాపార ప్రయాణంలో కీలకమైన మార్పు. ఉత్పత్తులను విక్రయించడంతోపాటు ఇతర ప్రాంతాల మహిళా పారిశ్రామికవేత్తలు, కళాకారులతో పరస్పర అనుభవాలను పంచుకునే అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర మహిళలు తమ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల ఉత్పత్తులతో పోల్చుకుని మరింత మెరుగైన నాణ్యత, ప్యాకేజింగ్, బ్రాండింగ్ వైపు అడుగులు వేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది.

పండుగ వాతావరణంలో పల్లె సంస్కృతి

ఈ మేళా షాపింగ్‌కు మాత్రమే పరిమితం కాక కుటుంబంతో కలిసి సందర్శించేలా పండుగ వాతావరణాన్ని కల్పించనుంది. రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. 11న మంత్రి సీతక్కతోపాటు ఇతర మంత్రులు, ప్రముఖులు మేళాను సందర్శించనున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *