ప్రపంచవ్యాప్త ప్రభుత్వాలపై ఎందుకింత వ్యతిరేకత!

ఎన్నికలు  జరిగిన  పది ప్రధాన దేశాల్లో ఫలితాల్లో వోటర్ల ఆగ్రహమే కనిపించింది

ప్రపంచ వ్యాప్తంగా   పలు దేశాల్లో ఎన్నికలు  జరిగిన  పది ప్రధాన దేశాల్లో వోటర్ల ఆగ్రహమే ఫలితాల్లో కనిపించింది. అమెరికా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, జపాన్‌,  అర్జెంటీనా, సోలమన్‌ ఐలాండ్స్‌, తైవాన్‌, ఇండోనేసియాతో పాటు ఈ ఏడాది మరో 50కి పైగా దేశాల మధ్యా ఓ అరుదైన సారూప్యత ఏర్పడిరది.  అది, ఈసారి ఎన్నికలకు వెళ్లిన దేశాల్లో 80శాతం ప్రభుత్వాలు పరాజయం పాలయ్యాయి. ఈ ఏడాది 70కి పైగా దేశాలు ఎన్నికల పరీక్షకు నిలవడంతో 2024ను ప్రజాస్వామ్య సంవత్సరంగా అభివర్ణించారు. భారత్‌, అమెరికా, యూకే, యూరోపియన్‌ యూనియన్‌, జపాన్‌, రష్యాలాంటి అనేక చోట్ల ఈ ఏడాది ఎన్నికలు జరిగాయి. అంటే… ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది తమ మనసులో మాట వినిపించే సంవత్సరంలా నిలిచిందీ 2024. అయితే ఈ దేశాల్లోని మానవాళి మాత్రం తాము ’బతకలేకపోతున్నాం… పరిస్థితులను మార్చండి… పాలనను మెరుగు

image.png
పర్చండి’ అని నినదించింది.  ఖండాలు, దేశాలు, పార్టీలు, నాయకులు, సంస్కృతులు వేరైనా అన్ని దేశాల్లోనూ ప్రజల రియాక్షన్‌ ఒక్కటే. అమెరికా నుంచి ఇండోనేసియా దాకా ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల తీర్పుల అంతరార్థం ఇదే! మరికొన్ని రోజుల్లో సంవత్సరం ముగుస్తున్న దశలో… అనేక దేశాల్లో ఎన్నికలు ముగిశాయి. వీటిలో కేవలం 20శాతం దేశాల్లో మాత్రమే పార్టీలు అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. మిగిలిన అన్ని చోట్లా అధికారంలో ఉన్నవారికి ప్రజలు చుక్కలు చూపించారు. వ్యతిరేక వోటుతో గద్దె  దించారు. యూకేలో దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్‌ పార్టీని ఇంటికి పంపించారు. న్యూజిలాండ్‌లో లేబర్‌ పార్టీ, జపాన్‌లో ఎల్‌డీపీ, దక్షిణాఫ్రికాలో ఏఎన్‌సీ, తాజాగా అమెరికాలో డెమోక్రాట్లను తిరస్కరించారు. దక్షిణాఫ్రికాలో నెల్సన్‌ మండేలా పార్టీ ఎఎన్‌సీ… తొలిసారి ఘోర పరాజయం పాలైంది.  అమెరికాలో అధికారంలో ఉన్న పార్టీ వరసగా ఓడిపోవటం వందేళ్లలో ఇదే తొలిసారి. ఒబామా తర్వాత డెమోక్రాట్లు,  ట్రంప్‌ తర్వాత రిపబ్లికన్లు, మళ్లీ ఇప్పుడు బైడెన్‌ తర్వాత డెమోక్రాట్లు ఓడిపోయారు. నాలుగేళ్ల కిందట వద్దనుకున్న, అనేక కేసులు ఎదుర్కొంటున్న డొనాల్డ్‌ ట్రంప్‌నే మళ్లీ అమెరికా ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించుకున్నారంటే వారిలో ప్రస్తుత ప్రభుత్వ తీరుపై ఎంత వ్యతిరేకత గూడుకట్టుకుందో తెలిసిపోతోంది.

ఖండాలు, సరిహద్దులను చెరిపేసుకొని ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ఈ ట్రెండ్‌ చెబుతున్నదేంటి? భౌగోళిక రాజకీయాలు, యుద్దాలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, వలసలు… అన్నీ కలిసి రాజకీయ, సామాజిక, ఆర్థిక అసమానతలు, అస్తవ్యస్త పరిస్థితులను సృష్టిస్తు న్నాయి. అవి అన్ని దేశాల్లోనూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు ఉద్యోగాలు ఊడుతుండటం, జీతాలు తగ్గుతుండటం… ప్రజలను అనిశ్చితిలోకి నెట్టాయి. ఫలితమే ప్రభుత్వాలపై వ్యతిరేకత!  ప్రపంచవ్యాప్త వ్యతిరేకత!  మరి కొత్త నాయకత్వాలు ప్రజల తీర్పును ఎంతవరకు గౌరవిస్తాయనేది చూడాల్సివుంది.
-చరణ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *