ఫిజిక్స్ అరుణ్ కుమార్
పేదరిక కదనరంగాన
తన నేత్రాల నెబ్యులాలో
భవిష్యత్ భారత గెలాక్సీలను దర్శించి
కాలపు కనుసైగల దారులలో
స్వప్నాలను ఫోటాన్లుగా మార్చి
“అగ్ని” శిఖరాల సాక్షిగా
భరతమాత గుండె వనంలో
విజయ కిరణాల
దేశభక్తి పుష్పాలు పూయించాడు
హృదయ తరంగాల గగన వేదికపై
రాకెట్ గర్జనల జాతి సమైక్యత సంగీతంతో
పోఖ్రాన్ అణు స్పందనల ప్రతిధ్వనిని
శతాబ్దాల సంకల్ప
సమీకరణంగా మలిచాడు
నవ యువభారతాన్ని
ప్రపంచ దిక్సూచిల అంతరిక్ష క్షేత్రంలో
ధృవతారగా నిలిపాడు
ఫిజిక్స్ కలల రెక్కలపై
కాలపు క్వాంటం సొరంగాల్లో విహరిస్తూ
ఫీనిక్స్‌లా బూడిదలోంచి లేచిన
అసాధారణ భారతరత్న
అక్షర విత్తనాలను నాటి
వాటిని శాంతి వికాస
పుస్తక నక్షత్రాలుగా వికసింపజేశాడు
పేపర్ బాయ్ నుండి ప్రెసిడెంట్
అతని ప్రయాణం
అసాధారణ సంభావ్యతను
వాస్తవంగా మార్చిన
జీవితశాస్త్ర ప్రయోగం
“Dare to Dream”
కోట్లాది యువత
మనసు ల్యాబరేటరీలో
భవిష్యత్తును సంశ్లేషించే
గెలుపు వెలుగు సూత్రం
“Low Aim is Crime”
అంతరిక్షాన్ని చూస్తూ పుట్టిన
అనంత ఆత్మవిశ్వాస
గురుత్వాకర్షణ నియమం
ఉత్తేజిత జ్ఞాన శిఖర జ్యోతులను
తన గుండె ఉపరితలంపై రగిలించి
వాటిని “Wings of Fire”గా మార్చి
రామేశ్వరాన్ని ఈ దేశ ముఖచిత్ర
తీర్థయాత్రగా రూపాంతరం చేశాడు
అతని ఆలోచనల స్వప్నాలు
భవిష్యత్ తరాల మెదళ్లలో
కాలగర్భంలో ప్రయాణించే స్పేస్ ప్రోబ్స్‌లా
తరతరాల గమ్యాలను అన్వేషిస్తున్నాయి
చిరునవ్వుల వెన్నెల సలాంకు
స్వప్నాల కలాం చిరునామాగా నిలిచి,
నిరాశా నిస్పృహల డార్క్ మ్యాటర్‌ను చేధిస్తూ
ఆశల సూపర్‌నోవాగా
ప్రతి యువ హృదయంలో
కొత్త విశ్వాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు
అనంతత్వంలోకి ప్రవేశించి
ప్రతి శాస్త్రీయ ఆలోచనలో
చిరంజీవిగా ప్రభవిస్తూనే ఉన్నాడు





