– రెండోదఫా చర్చల వేళ ఇరాన్ డిమాండ్
టెహ్రాన్, ఏప్రిల్ 15: అమెరికాతో రెండోసారి శాంతి చర్చలు ప్రారంభం కానున్న వేళ ఇరాన్ కీలక డిమాండ్‌ను ముందుకు తెచ్చింది. ఇటీవల జరిగిన యుద్ధంలో తమ దేశానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొంటూ దాదాపు 270 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.25 లక్షల కోట్ల పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. తమకు జరిగిన నష్టాలను భర్తీ చేసేందుకు ఇతర దేశాలు సహాయపడాలని ఇరాన్ కోరుతోంది. యుద్ధం కారణంగా దేశంలోని మౌలిక సదుపాయాలు, గృహాలు, రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ నష్టాన్ని దేశం ఒంటరిగా భరించడం సాధ్యం కాదని, అంతర్జాతీయ స్థాయిలో పరిహారం అవసరమని పేర్కొంది. గృహ నిర్మాణాలు, మౌలిక వసతులు ధ్వంసం అవడమే కాకుండా, చమురు, వాణిజ్య రంగాల్లో మూసివేత వల్ల నష్టాలు భారీగా ఉన్నాయని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నష్టాల అంచనా ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై పన్ను విధించడం వంటి చర్యలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, యుద్ధ సమయంలో ఐదు అరబ్ దేశాలు తమ భూ భాగాన్ని ఉపయోగించేందుకు అమెరికా-ఇజ్రాయెల్ దళాలకు అనుమతి ఇచ్చాయని, ఆ దేశాలు కూడా తమకు పరిహారం చెల్లించాలని ఇరాన్ ఇప్పటికే కోరింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



